రాష్ట్రంలో వేసవి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరగనున్నాయి. రానున్న పదిరోజుల పాటు తెలంగాణ అంతటా వేడిగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పగటి ఉష్ణోగ్రతలు 44 నుంచి 45 డిగ్రీలకు చేరే సూచనలున్నాయి. కోసాంధ్ర నుంచి రాయలసీమ మీదుగా కర్ణాటకపైకి వలయాకారంలో ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీనివల్ల బంగాళాఖాతం నుంచి వచ్చే తేమగాలులతో తెలంగాణలో మంగళ, బుధవారాల్లో వాతావరణం చల్లబడి ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశాలున్నాయి. ఎక్కువ ప్రాంతాల్లో వేడి గాలులు వీస్తాయి. రాష్ట్రంలో గత రెండేళ్లతో పోలిస్తే ఈ సీజన్‌లో వడగాలులు ఇంకా ప్రారంభం కాలేదని వాతావరణ శాఖ సంచాలకురాలు నాగరత్న చెప్పారు.
ఉరుములతో కూడిన జల్లులు పడే ప్రాంతాల్లో తేమ సాధారణ స్థాయిలో ఉంటోంది. పగటి పూట భూమి రేడియేషన్ అధికమైన ప్రాంతాల్లో రాత్రిపూట సైతం సాధారణంకన్నా ఎక్కువగా ఉష్ణోగ్రతలుంటున్నాయి. ఉదాహరణకు సోమవారం తెల్లవారుజామున ఖమ్మం నగరంలో 30 డిగ్రీలుంది. ఇది సాధారణంకన్నా 4 డిగ్రీలు అధికం. ఎండలు, ఉక్కపోతల కారణంగా కరెంటు వినియోగం పెరుగుతోంది. ఈ నెల 8న 7,313 మెగావాట్ల కరెంటు వినియోగమవగా ఈ నెల 19న 8,310 మెగావాట్లకు పెరిగింది.
రాష్ట్రంలో వేసవి ఉష్ణోగ్రతలు నానాటికి పెరుగుతున్న దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని, ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ శాఖలను, జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. వడగాల్పులతో మరణాలు సంభవించకుండా చర్యలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ సంస్థ ముఖ్య కార్యదర్శి డాక్టర్ చంద్రవ దన్ కోరారు. గత మూడేళ్లలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 47 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదైందని ఆయన గుర్తుచేశారు. వేసవి మరణాలను నివారించేందుకు రాష్ట్రవ్యాప్తంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యల గురించి ప్రభుత్వం రూపొందించిన ‘హీట్‌వేవ్ యాక్షన్ ప్లాన్-2018’ను ఆయన తాజాగా విడుదల చేశారు.