తెలుగును కాపాడుకుందాం…

223
Telugu is mother language
- Advertisement -

తెలుగును కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ప్రపంచ తెలుగు మహాసభలు జరగడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ తల్లికి పుష్పాంజలి ఘటించిన వెంకయ్య…అనంతరం జ్యోతి ప్రజ్వాళన చేసి తెలుగు మహాసభలను  ప్రారంభించారు. అనంతరం  మాట్లాడిన వెంకయ్య తెలుగు వారు ఎక్కడున్న వారిని పలకరించడం తనకు అలవాటు అన్నారు.  తెలుగు వారి సంగీత సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొనడం తనకు అలవాటు అన్నారు.

40 ఏళ్లు హైదరాబాద్‌లో ఉన్నానని తెలిపిన వెంకయ్య….తెలుగు అన్నా..తెలుగు నేల అన్న ఎనలేని అభిమానమని తెలిపారు. తెలుగు భాషనే తల్లిగా భావిస్తానని తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రసంగం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. చక్కని భోజనం చేసినట్లుగా ఉందన్నారు. పరిపాలన పరంగా తెలుగు భాషను అధికారికం చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలుగు వెలుగు కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న  కృషి అభినందనీయమన్నారు.

మాతృభాషను అధ్యయనం చేసి ఆ అమృతాన్ని ఆస్వాధించాల్సిన అవసరం ఉందన్నారు.గురువులను గౌరవించుకోవడం మన సంప్రదాయమని..సభప్రారంభానికి ముందు సీఎం  కేసీఆర్ ఆయన గురువు మృత్యుంజయను సన్మానించుకోవడం అభినందించాల్సిన విషయం అన్నారు. ఎంత ఎత్తుకు ఎదిగిన కన్న తల్లి..ఉన్న ఊరు..చదువు చెప్పిన గురువును మర్చిపోవదన్నారు. గూగుల్ వచ్చినా గురువు స్ధానాన్ని భర్తీ చేయలేదన్నారు.

1975 తర్వాత భాగ్యనగరంలో తెలుగు మహాసభలు జరగడం ఆనందించాల్సిన  విషయం…సీఎం కేసీఆర్‌ని అభినందించాల్సిన అంశమన్నారు. సీఎం కేసీఆర్ సాహితీ ప్రియుడని కొనియాడారు. ఎంతోమంది సాహితీ వేత్తలను ఈ మహాసభల ద్వారా గుర్తుచేసుకుంటున్నామని తెలిపారు.

సమాజం నుంచి భాషను విడదీసి చూడలేమన్నారు. హాలుడి కాలం నుంచి తెలుగు ఉందన్నా వెంకయ్య..మన మాతృభాషను మర్చిపోయిన వాడు మనిషే కాదన్నారు. భాషను మాత్రమే కాదు యాసను మర్చిపోవద్దన్నారు. ఎక్కడున్నా తెలుగు వారందరు ఒక్కటేనని వెంకయ్య స్పష్టం చేశారు. భాష జాతిని బలపరుస్తుందన్నారు. బడిపలుకుల భాష కాదు పలుకుబడుల భాష కావాలన్న కాళోజి మాటలతో తాను ఏకీభవిస్తానని తెలిపారు.

గతంలో తెలుగు ప్రాంతీయ భాషగా నిరాదరణకు గురైందని కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి మారిందన్నారు. ఏ భాషనైన తనలో ఇముడింపజేసుకోవడం తెలుగు ప్రత్యేకత అన్నారు. ఎందరో మహానుభావులు భాష పరిరక్షణకు,సాంస్కృతిక పునరుజ్జీవనానికి కారణమయ్యారని పొగడ్తలు కురిపించారు. తెలంగాణ నేలలో సాహిత్యానికి ప్రత్యేకత ఉందన్నారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని దాశరథి కృష్ణమాచార్యులు నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నారని తెలిపారు. ప్రశ్నించే, ప్రతిఘటించే సాహిత్యం తెలంగాణలో పురుడుపోసుకుందన్నారు. బతుకమ్మ,బోనాలు,పీర్ల పండగ,సమ్మక్క సారక్క జాతర ఇక్కడి సంస్కృతికి ప్రతిభింబాలు అన్నారు.

ఢిల్లీలో తెలంగాణ వాడి సత్తాను చాటిన గొప్పవ్యక్తి  పీవీ నరసింహరావు అని కొనియాడారు. దేశంలో రాజకీయ సంస్కరణలు తీసుకొచ్చి అభివృద్ధికి పాటుపడ్డారని తెలిపారు. బహుబాష కోవిధుడిగా ప్రజలు గుర్తించారని తెలిపారు. సినారె తెలుగు వాడు కావడం మన అదృష్టమన్నారు.తెలుగు భాషను మర్చిపోవద్దన్నారు.

అంతకముందు తెలుగు మహాసభలకు హాజరైన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడిని పూర్ణకుంభంతో ప్రభుత్వం స్వాగతం పలికింది. బ్రహ్మాశ్రీ మృత్యుంజయ శర్మకు సీఎం కేసీఆర్ గురువందనం చేశారు. తెలంగాణ సాహితీ అకాడమీ ఛైర్మన్ నందిని సిద్దారెడ్డి స్వాగత ఉపన్యాసం చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్లు నరసింహన్‌,విద్యాసాగర్ రావుతో పాటు రాష్ట్రమంత్రులు,ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. తెలుగు అక్షర కాంతులను విశ్వమంతా వెదజల్లాలనే లక్ష్యంతో ప్రభుత్వం మహాసభల ఏర్పాట్లను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ప్రధాన వేదికలు సిద్దమయ్యాయి. దేశవిదేశాల నుంచి సాహితీ వేత్తలు, తెలుగుభాషాభిమానులు పెద్ద ఎత్తున మహాసభలకు తరలివచ్చారు. నేటి నుంచి 19వ తేదీ వరకు తెలుగు మహాసభలు జరగనున్నాయి.

- Advertisement -