తెలంగాణ రాష్ట్ర బీజేపీనాయకులపై తనదైన శైలీలో సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వికారాబాద్ జిల్లా పర్యటనకు వెళ్లిన కేసీఆర్ కాన్వాయ్‌కు బీజేపీ నాయకులు అడ్డురావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ జెండాలు పట్టుకుని వస్తే మాకు కూడా జెండాలు ఉన్నాయి వాటితో మీకు అడ్డం వస్తే ఏలా ఉంటుంది అని ప్రశ్నించారు.
తెలంగాణ ప్రజలు మోసపోతే గోసపడే పరిస్థితులు వస్తాయన్నారు. వచ్చిన తెలంగాణను మళ్లీ గుంట నక్కలు వచ్చి పీక్కొని తినకుండా, పాత పద్దతికి మళ్లీ పోకుండా, మళ్లీ పరిస్థితులు దిగజారకుండా, వారి రాజకీయ స్వార్థాలకు బలికాకుండా ఈ తెలంగాణను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఊరికే రాలేదు తెలంగాణ. ఇవాళ ఎవడూ పడితే వాడు అది మాట్లాడుతున్నాడు. మన బాధలు చూడనివారు మన అవస్థలు పట్టించుకోనివారు, నవ్విన వారు అడ్డం పొడవు మాట్లాడుతున్నారు. ఆనాడు ఉద్యమం జరిగినప్పుడ 14 సంవత్సరాలు పోరాటం చేశాను. చావు అంచు దాకా వెళ్లి ఈ రాష్ట్రాన్ని సాధించాను. తెలంగాణ తెచ్చిన తర్వాత మీరు ఆశీర్వాదం ఇస్తే అనేక సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటున్నాము. ఈ పథకాలన్నీ కొనసాగాలి. రాష్ట్రంలో పరిశ్రమలు, ఐటీ, వ్యవసాయ రంగాల్లో ముందుకు పోవాలి… కలలుగన్న బంగారు తెలంగాణ అప్పుడే సాధ్యమవుతుందని కేసీఆర్ పేర్కొన్నారు.
ఈ దేశంలో ఏం జరుగుతుందని కేసీఆర్ ప్రశ్నించారు. మన రాష్ట్రం బాగుంటే సరిపోదు. వివేకంతో మనందరం ఆలోచించాలి. తెలంగాణ అద్భుతంగా పురోగమిస్తుంది. అన్ని రంగాల్లో ముందుకు పోతుంది. కానీ కేంద్రంలో ఉన్నవారు మనం ఇచ్చే వాటిని ఉచితాలు అని చెప్తున్నారు. కొంతమంది చిల్లరమల్లరగాళ్లు జెండాలు పట్టుకుని నా బస్సుకు అడ్డం వచ్చారు. అడ్డం వచ్చిన ఆ ఐదారు మంది పోరగాళ్లను మనోల్లు కొడితే తుక్కుతుక్కు అవుతారు. వారు ఏం ఉద్ధరించారు. ఏం లాభం చేశారు. 8 ఏండ్ల నుంచి బీజేపీ దేశానికి ఒక్క మంచి పని చేసిందా? దీనిపై మీరందరూ చర్చ జరపాలన్నారు. రాజకీయంగా చైతన్యం లేని సమాజం దోపిడికి గురవుతుంది. మోసపోతే గోస పడుతామని…అలా గోస పడకుండ ఉండాలని తెలంగాణ ప్రజలను కోరుకుంటున్నాన్నారు. సమైక్య పాలకుల చేతిలో విలవిలలాడిపోయామన్నారు. అప్పుడు పెరుగు అన్నం తినే రైతులు పురుగుల మందు తాగి చచ్చిపోయారు. ఆ బాధలు మళ్లీ తెలంగాణకు రావొద్దంటే మనం అప్రమత్తంగా ఉండాలన్నారు. యువకులు ముఖ్యంగా అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ సూచించారు.