KTR:కరువునేలగా అల్లాడిన నేల.. దేశానికే బువ్వపెడుతుంది

28
- Advertisement -

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నేడు రైతు దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ ప్రభుత్వం గడిచిన 9యేళ్లలో ఎన్నో విజయాలను సాధించింది. అతి తక్కువ కాలంలో రైతులకు చివరి ఆయకట్టుకు నీరందించిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ మేరకు కేటీఆర్ ట్విట్టర్‌ ద్వారా స్పందించారు.

నెర్రెలు బారిన ఈ నేల దశాబ్దిలోపే 2కోట్ల ఎకరాల పచ్చని మాగాణమైందన్నారు. వ్యవసాయం దండుగ అన్న చోటనే పండుగలా జరుపుతున్నామని తెలిపారు. కరువునేలగా అల్లాడిన తెలంగాణ ఇవాళ దేశానికి బవ్వపెట్టే అన్నపూర్ణగా మారిందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని కిసాన్ సర్కార్ దేశంలో ఎక్కడాలేని విధంగా రైతన్నకు అందిస్తున్న వరాల వల్లనే ఈ అద్భుతం ఆవిష్కృతమైంద‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

దేశంలో మరే రాష్ట్రంలో లేని పథకాల వల్లనే ఈ అద్భుతం సాధ్యమైంది అని కేటీఆర్ అన్నారు. 65 లక్షల మంది రైతులకు రూ. 66 వేల కోట్ల పెట్టుబడి సాయంగా రైతుబంధు కింద‌ అందించిన ఏకైక ప్రభుత్వం అని ఆయ‌న పేర్కొన్నారు. ఒక్కో రైతుకు రూ. 5 లక్షల చొప్పున లక్షా 782 రైతు కుటుంబాలకు రూ.5,039 కోట్లు పరిహారంగా చెల్లించి ఆదుకున్నదని అన్నారు. 27 లక్షల వ్యవసాయ మోటార్లకు ఉచితంగా విద్యుత్ అందిస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

రైతుకు అండగా ఉండేందుకు గానూ 10,769 గ్రామాల్లో రైతుబంధు సమితులు ఏర్పాటు చేశామ‌ని గుర్తు చేశారు. భూ యాజమాన్య హక్కులపై స్పష్టత ఇచ్చేందుకుగానూ భూ రికార్డుల సమగ్ర ప్రక్షాళన చేపట్టి ధరణి ద్వారా శాశ్వత పరిష్కారం చూపించామ‌న్నారు. రైతులను సంఘటితం చేసేందుకు ప్రతి 5వేల ఎకరాలకు ఒక క్లస్టర్ చొప్పున 2,601 రైతువేదికల ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. సకాలంలో నాణ్యమైన విత్తనాలు, ఎరువుల‌ను అందిస్తున్నామ‌ని తెలిపారు. పండిన పంట నిలవకు నూతన మార్కెట్ షెడ్లు, గోదాముల నిర్మాణం చేప‌డుతున్నామ‌ని చెప్పారు.

Also Read: కొలంబియా: అమెజాన్‌లో పసివాళ్లు ఏమయ్యారో..!

పండిన ధాన్యం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంద‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. రైతన్నకు అండగా తీసుకున్న చర్యల మూలంగా తెలంగాణలో సాగు విస్తీర్ణం 1.31 కోట్ల ఎకరాల నుండి 2.09 కోట్ల ఎకరాలకు పెరిగింద‌ని తెలిపారు. 2014లో 68 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి నేడు 2.60 కోట్ల టన్నుల మెట్రిక్ టన్నులకు ధాన్యం ఉత్పత్తి పెరిగింద‌ని కేటీఆర్ ట్విటర్‌లో పేర్కొన్నారు.

Also Read: బీజేపీ ” ఇంటింటి ప్రచారం ” ప్రజాగ్రహం తప్పదా ?

- Advertisement -