పారిశ్రామికాభివృద్ధిలో తెలంగాణ నెం.1.. కేంద్రం వెల్లడి..

27

కేంద్ర ప్రభుత్వం సుపరిపాలనా ర్యాంకులను వెల్లడించింది. మాజీ ప్రధాని వాజ్‌పేయీ జయంతి సందర్భంగా డిసెంబరు 25ను ‘సుపరిపాలన దినం’గా నిర్వహిస్తున్నారు. శనివారం కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ‘సుపరిపాలన సూచీ- 2020-21’ని విడుదల చేశారు. వ్యవసాయ, అనుబంధ రంగాలు; వాణిజ్యం, పరిశ్రమలు; మానవ వనరుల అభివృద్ధి; ప్రజారోగ్యం; మౌలిక సదుపాయాలు-సేవలు; ఆర్థిక పరిపాలన; సాంఘిక సంక్షేమం, అభివృద్ధి; న్యాయ వ్యవస్థ- ప్రజాభద్రత; పర్యావరణం; పౌర కేంద్రీకృత పాలన.. అనే 10 అంశాల్లో రాష్ట్రాలు సాధించిన పురోగతి ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఈ ర్యాంకులను ప్రకటించింది.

పారిశ్రామికాభివృద్ధి విషయంలో తెలంగాణ రాష్ట్రం మంచి పనితీరు చూపిస్తోంది. 2020-21 సంవత్సరానికి వృద్ధి రేటు 8.78 శాతంగా నమోదైంది. దీంతో దేశంలోనే పారిశ్రామిక అభివృద్ధి విషయంలో మొదటి స్థానాన్ని సొంతం చేసుకుంది. పారిశ్రామికాభివృద్ధిలో తెలంగాణకు 0.699 స్కోరు లభించింది. గుజరాత్ రాష్ట్రం 0.662 స్కోరుతో రెండో స్థానంలో ఉంది. 0.627 స్కోరుతో పారిశ్రామికాభివృద్ధి విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆరో స్థానంలో నిలిచింది. ఇక దేశంలో సుపరిపాలన పరంగా గుజరాత్ మొదటి స్థానంలో ఉంటే, మహారాష్ట్ర రెండో స్థానం సొంతం చేసుకుంది. ఈ విషయంలో తెలంగాణ 9వ స్థానం, ఏపీ 10వ స్థానంలో నిలిచాయి. సాంఘిక సంక్షేమం, అభివృద్ధిలోనూ తెలంగాణకు మొదటి స్థానం లభించింది. 0.699 స్కోరు దక్కింది. ఏపీ 0.546 స్కోరుతో ఆరో స్థానంలో ఉంది.