తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ మరియు తెలంగాణ విజయ గర్జన కార్యక్రమాల నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు నియోజకవర్గస్థాయి ప్రతినిధులతో నిర్వహిస్తున్న సమావేశాలు మూడో రోజు కూడా కొనసాగాయి. ఈరోజు మేడ్చల్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలకు చెందిన నియోజకవర్గాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులతో కేటీఆర్ సమావేశాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సమితి గత 20 సంవత్సరాల పార్టీ ప్రస్థానంలో అద్భుతమైన త్యాగాలతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిందని, ప్రజల ఆశీర్వాదంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు గారి మార్గనిర్దేశనంలో దేశంలోని ఒక అగ్రగామి రాష్ట్రంగా మారిందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమ సందర్భంగా చేసిన కార్యక్రమాలను, త్యాగాలను మరోసారి మననం చేసుకుంటూ పార్టీ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటామని, ఇందుకోసం పార్టీ శ్రేణులను సమాయత్తం కావాలని మంత్రి కేటీఆర్ సూచించారు. ద్విదశాబ్ది ఉత్సవాల కోసం పార్టీ చేపట్టనున్న తెలంగాణ విజయ గర్జన సభను విజయవంతం చేసేందుకు ఇప్పటి నుంచే గట్టి కార్యాచరణ చేపట్టాలని కోరారు. పార్టీకి గ్రామ, వార్డు, డివిజన్ స్థాయిలో ఉన్న ప్రతి యూనిట్ నుంచి భారీగా కార్యకర్తలు విజయ గర్జన సభకు తరలి రావాల్సి ఉంటుందని ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను స్థానిక మంత్రులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఈనెల 25వ తేదీన జరిగే పార్టీ ప్లీనరీ సమావేశానికి పార్టీ ప్రజలకు ప్రత్యేకంగా ఆహ్వానం అందుతుందని, వారంతా 25వ తేదీన హైదరాబాద్లోని హైటెక్స్ ప్రాంగణంలో చేరుకోవాల్సి ఉంటుంది అని కేటీఆర్ అన్నారు.
ఈ సమావేశాల్లో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్, పార్టీ సెక్రటరీ జనరల్ కే. కేశవరావు, యంపి రంజిత్ రెడ్డి మరియు ఆయా నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు మరియు పార్టీ సీనియర్ నాయకులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు.