హైదరాబాద్‌లో కొత్తగా ‘బి హబ్’..

216
Minister KTR
- Advertisement -

హైదరాబాద్‌లో బయోటెక్నాలజీ, బయో ఫార్మా రంగానికి ప్రత్యేకంగా బి- హబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కేటీ రామారావు ఈ రోజు ప్రకటించారు. బయో ఫార్మా, బయోటెక్ రంగాల్లో పరిశోధనలకు ఊతం ఇవ్వడంతోపాటు, తయారీ రంగంలోకి ప్రవేశించే కంపెనీలకు బి- హబ్ ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు. బేగంపేట క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో బి- హబ్ ఏర్పాటు పైన మంత్రి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్‌తో పాటు తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ నరసింహారెడ్డి, లైఫ్ సైన్సెస్ మరియు ఫార్మా డైరెక్టర్ శక్తి నాగప్పన్, ఇతర అధికారులతో మంత్రి చర్చించారు. త్వరలో ఏర్పాటు చేయబోయే ఈ బి- హబ్ ప్రాజెక్ట్ కోసం సుమారుగా 60 కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో ఏర్పాటు చేసే బి- హబ్ హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో ఏర్పాటు అవుతుందన్నారు.

బయో ఫార్మా రంగంలో పరిశోధనలకు ఊతమిచ్చేలా ఇలాంటి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టడం దేశంలోనే మొదటిసారి అని, బి- హబ్ ఏర్పాటు ద్వారా సుమారు 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో పరిశోధనశాలల సౌకర్యంతోపాటు, పరిశోధనలకు ఉపయోగపడే ఇంక్యుబేటర్ ఒకటి అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ప్రపంచంలో బయో ఫార్మా రంగంలో ముందు వరుసలో ఉన్న కొరియా, చైనా, ఫ్రాన్స్ లాంటి దేశాల స్ధాయి పరిశోధన మరియు తయారీ సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని, దీని ద్వారా స్వదేశీ కంపెనీలకు అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు అందుబాటులోకి వచ్చినట్లవుతాయన్నారు.

Minister KTR

బి- హబ్ ద్వారా బయోఫార్మా రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని అన్న విశ్వాసాన్ని మంత్రి వ్యక్తం చేశారు. బయో ఫార్మా రంగంలో ఇప్పటికే తమ పరిశోధనలను కొనసాగిస్తూ, తదుపరి దశ అయిన ఉత్పత్తి ప్రక్రియలోకి వెళ్లేందుకు ఉండే ఇబ్బందులు, సవాళ్లను అధిగమించేందుకు బి- హబ్ సౌకర్యం ఉపయుక్తంగా ఉంటుందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ఫార్మా పరిశోధనలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అవసరం అయిన బిజినెస్ ప్లానింగ్, సెల్ లైన్ డెవలప్మెంట్, ప్రాసెస్ డెవలప్మెంట్, రిస్క్ అసెస్ మెంట్, లాంటి అనేక అంశాలలో ఉపయోగపడుతుందన్నారు.

భారతదేశ కంపెనీలు బయో ఫార్మా రంగంలో అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అవకాశాలను ఉపయోగించుకునేందుకు తమ విస్తరణ ప్రణాళికల్లో ఉన్న బయో ఫార్మా కంపెనీల ప్రయత్నాలకు మరింత ఊతమిచ్చేలా తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. భారతదేశ లైఫ్ సైన్సెస్ రాజధానిగా ఉన్న హైదరాబాద్ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు, ఆయా కంపెనీలకు తమ విస్తరణ ప్రణాళికల్లో ఎదురయ్యే ఇబ్బందులను ముందే గుర్తించి నిధులతో పాటు స్కేల్ అప్ మౌలిక సౌకర్యాలను కల్పించడం బయో ఫార్మా కంపెనీల విస్తరణకు అత్యంత కీలకమైన అంశమని, ఈ దిశగా బి-హాబ్ తన కార్యకలాపాలు కొనసాగిస్తుందన్నారు. ప్రస్తుతం ఏర్పాటు చేయనున్న బి-హాబ్‌లో బయో ఫార్మా స్కేల్ అప్ ప్రయోగశాల తోపాటు, సెల్ లైన్ డెవలప్మెంట్, క్లోన్ సెలక్షన్, అప్‌ స్ట్రీమ్‌ మరియు డౌన్‌ స్ట్రీమ్‌ ప్రొసెస్‌ డెవెలప్‌మెంట్‌, స్మాల్ స్కేల్ ప్రొడక్షన్ వంటి అనేక సౌకర్యాలు ఫార్మా కంపెనీల ప్రీ క్లినికల్ ఆధ్యయనాల కొరకు అందుబాటులోకి వస్తాయన్నారు.

భారతదేశంతో పాటు ఆసియా ఖండంలోనే ఫార్మా రంగంలో తనదైన ముద్ర వేసుకున్న జీనోమ్ వ్యాలీలో ఇప్పటికే 200పైగా కంపెనీల కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, ఈ రంగంలో అనేక పరిశోధనలు చేయడంతోపాటు తమ ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తున్నాయన్నారు. ఇలాంటి జీనోమ్ వ్యాలీలో జాతీయ అంతర్జాతీయ స్థాయి ఫార్మాస్యూటికల్ మరియు బయోటెక్నాలజీ కంపెనీలకు అనుసంధానంగా ఏర్పాటు చేయబోయే ఈ కామన్ స్కేల్ అప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ (బి-హాబ్) ద్వారా ఆయా కంపెనీలకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాల మేరకు పరిశోధనలు నిర్వహించి, వాటి ఉత్పత్తులను తయారుచేసేందుకు వాటిని మార్కెట్ చేసేందుకు సమయాన్ని తగ్గించేందుకు వీలు కలుగుతుందన్నారు.

ఇప్పటికే హైదరాబాద్ వ్యాక్సిన్ హబ్ ఆఫ్ ఇండియా గా ఉందని, రానున్న పది సంవత్సరాల్లో నాలుగు లక్షల ఉద్యోగాలను కల్పించడంతోపాటు సుమారు 100 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని మంత్రి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఈ దిశగా ఇప్పటికే జీనోమ్ వ్యాలీ 2.0, హైదరాబాద్ ఫార్మాసిటీ, మెడికల్ డివైసెస్ పార్ట్, లైఫ్ సైన్సెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ వంటి అనేక కార్యక్రమాల నేపథ్యంలో ప్రస్తుతం తాము చేపట్టనున్న బి-హాబ్ తమ లక్ష్యాలను అందుకోవడడంలో ఉపయోగపడుతుందని మంత్రి కెటి రామారావు తెలిపారు.

- Advertisement -