తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ ప్రారంభించి మూడు సంవత్సరాల్లోనే ఎంఎస్ఎంఈ రంగానికి అపూర్వమైన సేవలందిస్తున్నది. ప్రస్తుతం తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ ఇబ్బందుల్లో ఉన్న ఎంఎస్ఎంఈలను ఆదుకోవడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ రంగానికి మొదటి నుంచి ప్రాధాన్యత ఇస్తూ వస్తున్న ప్రభుత్వం, వివిధ కారణాలతో మూసివేతకు చేరువైన ఎంఎస్ఎంఈలను ఆదుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే గుర్తించింది. ఈ మేరకు 2016లో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ లాంటి ఒక వినూత్నమైన ఆలోచనతో ముందుకు వచ్చింది. ఈమేరకు అసెంబ్లీలో ఒక ప్రకటన చేసింది. 2017లో తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ స్థాపించబడింది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీగా ఆర్బిఐ నుంచి 2018 జనవరిలో గుర్తింపు పొందింది. 2018 ఏప్రిల్ నుంచి తన కార్యకలాపాలు ప్రారంభించిన తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ తన వినూత్నమైన వ్యహాలతో ఎంఎస్ఎంఈ రంగానికి వివిధ అంశాల్లో సహాకారం అందిస్తూ వస్తున్నది.
ముఖ్యంగా ఎంఎస్ఎంఈలు తాము తీసుకున్న రుణాలను కట్టలేక, డిపాల్ట్ అయినప్పుడు, కొంత సమయం కోరిన సందర్భంలో బ్యాంకులు నేరుగా వాటిని ఏన్‌పిఏలుగా ప్రకటించడం ఆనవాయితీ కొనసాగుతూ వస్తున్నది. అయితే ఎంఎస్ఎంఈ కావాల్సిన అతి కొద్ది సమయం కూడా చెల్లింపులకు లభించకపోవడంతో, అవన్నీ మూతపడే దిశగా వెళ్తున్నాయి. అయితే తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ ఇక్కడ తన పనిని ప్రారంభిస్తుంది. ఇలా రుణ గ్రస్త ఎంఎస్ఎంఈ ను అదుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. ఇప్పటి వరకి సుమారు 218 దరఖాస్తులను హెల్త్ క్లినిక్ స్వీకరించింది. ఇందులో 104 ఎంఎస్ఎంఈలను రివైవల్ చేసేందుకు అవకాశం ఉన్నట్లుగా గుర్తించింది. ఇందులోంచి 60 ఎంఎస్ఎంఈ ఇప్పటికే రివైవల్ అయి తమ కార్యకలాపాలను తిరిగి కొనసాగిస్తున్నాయి. దీంతోపాటు సుమారు 28 ఎంఎస్ఎంఈలకు ఆర్థిక సహకారాన్ని కూడా అందించడం జరిగింది. మరో 44 ఎంఎస్ఎంఈలను రివైవ్ చేసే దిశగా తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ తన ప్రయత్నాలను కొనసాగిస్తుంది. ఇప్పటిదాకా ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ చేసిన ప్రయత్నాల వలన సుమారు 95 కోట్ల రూపాయల ఎంఎస్ఎంఈ ఆస్తులను రక్షించగలిగింది. దీంతోపాటు 1800 మంది ఉద్యోగాలను కాపాడింది.
ప్రస్తుతం కేవలం రివైవల్ కోసం మాత్రమే పనిచేస్తున్న తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ మరింతగా తన పాత్రను పరిదిని పెంచుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఎంఎస్ఎంఈలకు పూర్తిస్థాయి సహకారం అదించడం ద్వారా ప్రభుత్వ, మరియు ప్రైవేటు సంస్థలు, బ్యాంకులు, అర్ధిక సంస్ధలతో సమన్వయం చేసుకునేందుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించే ఒక సంస్థగా మారేందుకు కృషి చేస్తుంది. ప్రస్తుతం ఉన్న కరోనా సంక్షోభం సందర్భంగా ఎంఎస్ఎంఈ లతో వెబినార్లు,సెమినార్ల వంటి కార్యక్రమాలను చేపట్టడం ద్వారా దానికి సంబంధించి అవగాహన చర్యలతో ముందుకు పోతున్నది. తెలంగాణలో వస్తున్న అద్భుతమైన వ్యవసాయ విప్లవం నేపధ్యంలో అగ్రికల్చర్, పుడ్ ప్రాసెసింగ్ రంగాల్లోని ఎంఎస్ఎంఈలకు మరింత ప్రాధాన్యత ఇచ్చేలా చూడడంలోపాటు చేనేత, పవర్ లూమ్ లోని ఎంఎస్ఎంఈలకు మార్కెటింగ్ వంటి అంశాల్లో సహాకరించి వాటి వృద్దికి దోహదకారిగా నిలిచేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.