జర్నలిస్టులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి..

272
- Advertisement -

జర్నలిస్టులు బాధ్యతాయుతంగా వార్తలు రాయాలని, బాలల హక్కుల పరిరక్షణలో ముందుండాలని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. ఆదివారం బంజారాహిల్స్ లోని హోటల్ మినర్వా గ్రాండ్‌లో తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ, మహిత, ప్లాన్ ఇండియా స్వచ్చంధ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఒక రోజు రాష్ట్ర స్థాయి జర్నలిస్టులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. బాలల పైన, మహిళల పైన జరుగుతున్న దోపిడీలను అరికట్టడానికి జర్నలిస్టులు నైతిక విలువలకు కట్టుబడి ఉండాలని సూచించారు.

Allam Narayana

నేర వార్తల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, చట్టాలపై పూర్తిస్థాయిలో అవగాహనా కలిగి ఉండాలని తెలిపారు. జర్నలిస్టులు సైతం ప్రవర్తన నియమావళిని పాటించాలని, లేనిచో తగిన ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. ప్రతి వార్తను సంచలన అంశంగా చూడరాదని, మానవీయ కోణం స్పృశించాలన్నారు. మీడియా ఎప్పుడు బాధితుల పక్షం నిలబడినప్పుడే ఆ వార్తల పట్ల విశ్వసనీయత ఉంటుందని అన్నారు.

ఆంధ్ర జ్యోతి ఎడిటర్ కే. శ్రీనివాస్ మాట్లాడుతూ, జర్నలిస్టులు ముఖ్యంగా వార్తలు రాసే క్రమంలో బాధితుల పేర్లు, ఫోటోలు, చిరునామా వివరాలు గోప్యంగా ఉంచాలని సూచించారు. సీనియర్ జర్నలిస్ట్ శ్రీమతి వనజ మాట్లాడుతూ, దశాబ్దాలుగా బాల్య వివాహాలపైన పోరాడుతున్నప్పటికీ ఎక్కడో ఒక చోట బాల్యవివాహాలు జరుగడం ఆందోళన కలిగించే విషయమన్నారు. జర్నలిస్టులు సమాచారం కోసం కాకుండా జరుగుతున్న నష్టాన్ని గురించి రాయడం చాల ముఖ్యమైన విషయం అన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేశ్వర్ రావు బాలలు, మహిళా చట్టాలలో గల నిబంధనలను జర్నలిస్టులకు అవగాహనా కల్పించారు.

Allam Narayana

సీనియర్ జర్నలిస్ట్ టంకశాల అశోక్ మాట్లాడుతూ, నేడు మీడియా విస్తృతంగా వ్యాప్తి చెందిందని, బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. బాధితులకు ఎటువంటి నష్టం కలుగకుండా వార్తలు రాయాలని ఈ దిశగా జర్నలిస్టులు తగిన కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మీడియా అకాడమీ కార్యదర్శి బి. రాజమౌళి, ప్లాన్ ఇండియా సీనియర్ ప్రోగ్రామర్ అనిత కుమార్, మహిత చైల్డ్ ప్రొటక్షన్ మేనేజర్ రుబీనా ఫిలిప్స్, జర్నలిస్టు రాష్ట్ర నాయకులు మారుతీ సాగర్, ఇస్మాయిల్, కో ఆర్డినేటర్ సుదర్శన్, నాగమ్మ, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -