తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో కీలక దశ పూర్తైంది. ఓటర్ల నుంచి ఫిర్యాదులు, అభ్యంతరాలు స్వీకరించేందుకు ఇచ్చిన గడువు ముగిసింది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత తుది ఓటర్ల జాబితాలో మొత్తం 2,43,23,059 మంది ఓటర్లు ఉండనున్నట్లు ఎన్నికల సంఘం అంచనా వేస్తోంది.
SIR ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలోని 1,71,99,536 మంది ఓటర్లు ఎలాంటి అదనపు ప్రక్రియ లేకుండానే తుది జాబితాలోకి చేరినట్లు సమాచారం. మరోవైపు దాదాపు 93 లక్షల మంది ఓటర్లకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. వీరిలో ఇప్పటివరకు 71,23,526 మంది సమర్పించిన పత్రాలు, వివరాలు సక్రమంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో వీరిని కూడా తుది ఓటర్ల జాబితాలో కొనసాగించేందుకు అవకాశం ఏర్పడింది.
అయితే నోటీసులు అందుకున్న వారిలో ఇంకా 21,64,654 మంది ఓటర్ల దరఖాస్తులపై విచారణ కొనసాగుతోంది. వీరు సమర్పించిన పత్రాలు, వివరాలను అధికారులు పరిశీలించాల్సి ఉంది. ఇదే సమయంలో కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్న సుమారు 4.5 లక్షల మంది దరఖాస్తులపైనా పరిశీలన కొనసాగుతున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
మిగిలిన దరఖాస్తులు, అభ్యంతరాలపై విచారణ పూర్తయిన తర్వాత నవంబర్ 9న తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో ప్రస్తుతం కొనసాగుతున్న పరిశీలన ప్రక్రియకు ప్రాధాన్యం ఏర్పడింది.
Also Read:UPI MDR వాయిదా..పేటీఎంషేర్ల పతనం
మొత్తం SIR ప్రక్రియలో భాగంగా తెలంగాణలో సుమారు 73,39,235 ఓట్లు తొలగిపోయే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే విచారణలో ఉన్న దరఖాస్తులు, పత్రాల పరిశీలన పూర్తయిన తర్వాతే తుది సంఖ్యపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
తుది జాబితా విడుదలతో రాష్ట్రంలోని ఓటర్ల సంఖ్యపై పూర్తి స్పష్టత రానుంది. అలాగే తొలగించిన ఓట్ల విషయంలో అర్హత ఉన్నవారి పేర్లు తిరిగి చేర్చే అవకాశాలపైనా ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోనుంది.

