తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక తీవ్ర సవరణ (SIR – Special Intensive Revision) ప్రక్రియ ఓటర్లను తీవ్ర గందరగోళానికి గురిచేస్తోంది. ఓటర్ల విచారణ ప్రక్రియలో అధికారులు జారీ చేసిన నోటీసులకు ఓటర్ల నుంచి పెద్దగా స్పందన రావడంలేదు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ రకాల పొరపాట్లు, ఆధార్/2002 ఓటర్ జాబితాతో మ్యాపింగ్ కాకపోవడం వంటి కారణాలతో నోటీసులు అందుకున్న కోట్లాది మంది ఓటర్లలో సగానికి పైగా విచారణకు హాజరుకాకపోవడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో నిర్వహించిన తనిఖీల అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు 82.02 లక్షల మందికి నోటీసులు జారీ చేయగా, అందులో ఏకంగా 43.98 లక్షల మంది (53.62%) ఓటర్లు విచారణకు హాజరుకాకపోవడం లేదా అధికారుల నోటీసులకు స్పందించకపోవడం గమనార్హం.మొత్తం నోటీసులు పొందిన 82 లక్షల మందిలో కేవలం 38 లక్షల మంది మాత్రమే విచారణాధికారుల ముందుకు వచ్చి తమ పత్రాలను సమర్పించారు.
• నోటీసులు జారీ అయిన మొత్తం ఓటర్లు : 82.02 లక్షలు
• విచారణకు స్పందించని ఓటర్లు : 43.98 లక్షలు (53.62%)
• విచారణకు హాజరైన ఓటర్లు : 38.00 లక్షలు
• సక్రమమైన గుర్తింపు పొందిన ఓటర్లు : 27.44 లక్షలు
సీఎం రేవంత్ నియోజకవర్గం కొడంగల్‌లోనే అత్యధికం!నోటీసులకు స్పందించని నియోజకవర్గాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం అగ్రస్థానంలో ఉంది.
కొడంగల్ లో నూటికి 96 మంది గైర్హాజరు..ఇక్కడ మొత్తం 66,342 మందికి నోటీసులు జారీ చేయగా, వారిలో 63,984 మంది (96%) ఓటర్లు విచారణ ముందుకు రాలేదు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 3.03 లక్షల మందికి నోటీసులు అందగా అందులో 2.48 లక్షల మంది అసలు స్పందించలేదు.పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తేడా లేకుండా దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఓటర్ల గైర్హాజరు శాతం భారీగా నమోదు కావడం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది.
మేడ్చల్-మల్కాజ్‌గిరి: 8,31,316 మంది,రంగారెడ్డి: 6,03,149 మంది,హైదరాబాద్: 5,13,264 మంది , సంగారెడ్డి: 2,24,058 మంది,నిజామాబాద్: 1,64,435 మంది , వికారాబాద్: 1,63,603 మంది ,సూర్యాపేట: 1,50,671 మంది, నల్గొండ: 1,49,754 మంది,భద్రాద్రి కొత్తగూడెం: 1,41,726 మంది ,మహబూబ్‌నగర్: 1,31,249 మంది , వరంగల్: 1,16,165 మంది,నిర్మల్: 1,06,965 మంది , కరీంనగర్: 1,01,945 మంది నోటీసులకు స్పందించలేదు.
విచారణకు హాజరై తమ గుర్తింపు కార్డులు సమర్పించిన 38 లక్షల మంది ఓటర్లలో కేవలం 27.44 లక్షల మంది ఓటర్ల వద్ద మాత్రమే సక్రమమైన గుర్తింపు పత్రాలు ఉన్నాయని ఎన్నికల కమిషన్ గుర్తించింది. తుది జాబితాలో ప్రస్తుతం వీరికి మాత్రమే ఓటు హక్కు కల్పించనున్నట్లు తెలుస్తోంది. టీసులు అందజేసినా ఓటర్లు విచారణకు ఆసక్తి చూపకపోవడానికి ప్రధాన కారణాలను అధికారులు మరియు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు:
()దాదాపు 24 సంవత్సరాల క్రితం నాటి (2002) ఓటర్ జాబితా ఆధారాలు, కుటుంబ వివరాలను అడగడంతో చాలామంది వద్ద ఆ వివరాలు అందుబాటులో లేకపోవడం.
() తల్లిదండ్రుల ఐడీ కార్డులు: చాలా ఏళ్ల కిందట మరణించిన లేదా దూరంగా ఉన్న తల్లిదండ్రుల పాత గుర్తింపు కార్డులను తీసుకురావాలనడం.
() కఠినమైన డాక్యుమెంటేషన్ నియమాలు: సాధారణ గుర్తింపు కార్డులను కాదని, ఈసీ నిర్దేశించిన కొన్ని ప్రత్యేక పత్రాలు మాత్రమే సమర్పించాలనడం.
() సమాచార లోపం: నోటీసులు క్షేత్రస్థాయిలో ఓటర్లకు సకాలంలో సరిగ్గా అందకపోవడం మరియు ప్రక్రియపై అవగాహన రాకపోవడం. హాజరుకాని 43 లక్షల కంటే ఎక్కువ మంది ఓటర్ల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకరంగా మారింది. రాబోయే తుది జాబితా ప్రచురణ నాటికి వీరికి మరొక అవకాశం ఇస్తారా లేదా ఓటు హక్కును కోల్పోవాల్సి వస్తుందా అనేది ఉత్కంఠగా మారింది.

