కాంగ్రెస్ నిర్లక్ష్యంతో ఓట్లు గల్లంతు!

1
- Advertisement -

తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, చేతకానితనం వల్లే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 90 లక్షల మంది ఓటర్ల ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం ఏర్పడిందని భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక తీవ్ర సవరణ (SIR) ప్రక్రియలో చోటుచేసుకుంటున్న లోపాలు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు షెడ్యూల్‌పై పలు అభ్యంతరాలు వ్యక్తం చేసిన బీఆర్ఎస్ నేతల బృందం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (CEO) సుదర్శన్ రెడ్డిని కలిసి అధికారికంగా వినతిపత్రం సమర్పించింది.

ఈ బృందంలో ఎమ్మెల్సీలు ఎల్. రమణ, డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మరియు బీఆర్ఎస్ నాయకురాలు సుమిత్రానంద్ ఉన్నారు.ఎన్నికల ప్రధానాధికారితో భేటీ అనంతరం ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లోనే ఎస్ఐఆర్ (SIR) నోటీసులు అందుకున్న ఓటర్లలో ఏకంగా 96 శాతం మంది విచారణకు హాజరుకాకపోవడం ప్రభుత్వ విఫలానికి నిదర్శనమని అన్నారు.ఎస్ఐఆర్ ప్రక్రియ తర్వాత ఈసీ జారీ చేసిన నోటీసులపై కాంగ్రెస్ సర్కార్ ఎలాంటి దృష్టి సారించడం లేదని మండిపడ్డారు.

ఒకవైపు లక్షలాది మంది ప్రజల ఓట్లు పోతుంటే పట్టించుకోకుండా, కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ నాయకుల ఇళ్ల చుట్టూ తిరుగుతూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారు అని ధ్వజమెత్తారు. ప్రజల ప్రాథమిక హక్కు అయిన ఓటు హక్కును కాపాడాలని ఈసీని కోరినట్లు తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మాట్లాడుతూ ఏ ప్రజాస్వామ్య ఎన్నికలకైనా ఓటు హక్కే అత్యంత కీలకమైన ఆయుధమని స్పష్టం చేశారు.ఎస్ఐఆర్ ప్రక్రియలో ఉన్న తీవ్రమైన లోపాలను, తప్పులను సవరించాలని బిఆర్ఎస్ క్షేత్రస్థాయి నుంచి పోరాడుతోందని తెలిపారు.

అర్హులైన ఏ ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి తొలగించబడకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు. బీఆర్ఎస్ ప్రతినిధి బృందం లేవనెత్తిన అభ్యంతరాలు, ఫిర్యాదులపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి సానుకూలంగా స్పందించారని వెల్లడించారు.

Also Read:అనుమాన పక్షి..కామెడీ,మిస్టరీ!

- Advertisement -