వచ్చే నెల రోజులు ఎంతో కీలకం : హరీశ్‌రావు

58
harish
- Advertisement -

ఇటీవలే కురిసిన భారీ వర్షాల వల్ల రాష్ట్రంలో సీజనల్‌ వ్యాధులు ప్రభలకుండ ముందస్తు జాగ్రత్తలు తీసుకొవాన్నారు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు. ఈ సందర్భంగా వచ్చే నెల రోజులు ఎంతో కీలకమన్నారు. ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాలు, ట్రైబల్‌ ఏరియాలో ప్రత్యేక దృష్టి సారించాలని వైద్యాధికారులకు సూచనలు జారీ చేశారు. ఎంసీఆర్‌హెచ్‌ ఆర్‌డీ నుంచి గురువారం ఆయన అన్ని జిల్లాల వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. సీజనల్‌ వ్యాధులు, బూస్టర్‌ డోస్‌, సీ సెక్షన్లు, ఎన్‌సీడీ స్క్రీనింగ్‌ తదితర అంశాలపై సమీక్షించారు.

రాష్ట్రంలో ప్రభలతున్న అంటువ్యాధైన డెంగీ కేసులు నమోదవుతున్న జిల్లాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి హ‌రీశ్‌రావు సూచించారు. లక్షణాలు ఉన్న వారికి పరీక్షలు నిర్వహించి, వెంటనే చికిత్స అందించాలన్నారు. ఒక వైపు అవగాహన పెంచడం, మరో వైపు సత్వర చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు ప్రైవేటు ద‌వాఖాన‌ల‌కు వెళ్లి జేబులు ఖాళీ చేసుకోకుండా, ప్రభుత్వ ద‌వాఖాన‌ల్లో ఉన్న వైద్య సేవలు సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. అనవసరంగా ప్రైవేటు దవాఖానలకు వెళ్లద్దోని సూచించారు. చికిత్స, రోగ నిర్ధారణ పరీక్షల సేవల గురించి అవగాహన కల్పించాలన్నారు.

మున్సిపల్, పంచాయతీ శాఖలు, స్థానిక ప్రజాప్రతినిధుల సమన్వయంతో పారిశుధ్యం పట్ల అవగాహన పెంచాలని మంత్రి హ‌రీశ్‌రావు ఆదేశించారు. నీటి నిల్వ లేకుండా చూడడం, ఫాగింగ్, ఫ్రై డే- డ్రై డే కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. తద్వారా దోమలు, ఈగల నియంత్రణ జరిగేలా చూడాలని సూచించారు. వర్షాలు, వరదల సమయంలో జిల్లా వైద్యాధికారులు సమన్వయంతో పని చేశారని, స్టాఫ్ నర్సులు, ఆశా కార్య‌క‌ర్త‌లు, ఇతర సిబ్బంది అందరూ మంచి సేవలు అందించారని అభినందించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఇంకా బాగా పని చేసి, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్నారు. ప్రతి పీహెచ్‌సీలో కుక్క, పాముకాటు మందులు తప్పనిసరిగా అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. సబ్ సెంటర్ల వారీగా జరుగుతున్న ఎన్‌సీడీ స్క్రీనింగ్ త్వరగా వంద శాతం పూర్త‌య్యేలా చూడాలన్నారు. మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాలను మంత్రి అభినందించారు.

పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బూస్టర్ డోస్‌ పంపిణీ విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. బూస్టర్ డోస్‌ చాలా ముఖ్యమని, అర్హులందరికీ వేసేలా రాష్ట్ర వ్యాప్తంగా యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. జన సాంద్రత ఎక్కువగా ఉన్న హైద‌రాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్, తదితర జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎంపీలు, ఎమ్మేల్యేలు, ప్రజా ప్రతినిధుల సహకారంతో వాక్సినేషన్ వేగంగా నిర్వహించాలని, ప్రజల్లో చైతన్యం కలిగించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వారానికి రెండు, మూడు రోజులు జిల్లాల్లో పర్యటిస్తూ, పురోగతిపై సమీక్షలు నిర్వహించాలని, వచ్చే పది రోజుల్లో వాక్సినేషన్ వేగం పెంచేలా చర్యలు తీసుకోవాలని డీహెచ్ శ్రీనివాస్‌రావును మంత్రి ఆదేశించారు.

రాష్ట్రంలో 2,77,67,000 మందిని అర్హులుగా గుర్తించగా, ఇప్పటి వరకు 12,87,411 మందికి బూస్టర్ వేసిన‌ట్లు వివ‌రించారు. రాష్ట్రంలో బూస్టర్ డోస్ పంపిణీకి ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసిందని మంత్రి హ‌రీశ్‌రావు తెలిపారు. 20 లక్షల పైగా డోసులు నిల్వ ఉన్నాయని చెప్పారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో బూస్టర్ డోస్‌ అందుబాటులో ఉందని, అన్ని జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఇంజినీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీల్లోనూ ప్రత్యేకంగా వాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించాలని డీఎంహెచ్‌వోల‌ను ఆదేశించారు. 040-24651119 నంబరును సంప్రదిస్తే.. 100 మంది కంటే ఎక్కువ మంది లబ్దిదారులు ఉన్న చోట వాక్సినేషన్ కేంద్రం ఏర్పాటు చేస్తార‌ని, ఈ విషయంపై ప్రచారం కల్పించాలన్నారు. ఆర్టీపీసీఆర్‌ పరీక్షల సంఖ్యను పెంచాలన్నారు.

ప్రతి గర్భిణికి నాలుగు ఏఎన్‌సీ చెకప్స్ పక్కాగా జరిగేలా చూడాలని మంత్రి హ‌రీశ్‌రావు ఆదేశించారు. ఈ విషయంలో మంచి పని తీరు నమోదు చేసిన జోగులాంబ గద్వాల, అదిలాబాద్, జనగాం, కుమ్రం భీం, సంగారెడ్డి జిల్లాలను అభినందించారు. సూర్యాపేట, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం ,ములుగు, వికారాబాద్ జిల్లాల్లో పనితీరు తక్షణం మెరుగుపడాలన్నారు. సీ సెక్షన్ల విషయంలో అందరం కలిసి కృషి చేస్తున్న నేపథ్యంలో గణనీయమైన మార్పు వచ్చిందన్నారు. అనవసర సీ సెక్షన్లు తగ్గించడంపై దృష్టి సారించాలన్నారు. ఈ విషయంలో మంచి పని తీరు క‌న‌బ‌రుస్తున్న నారాయ‌ణ్‌పేట్‌, కొమురం భీం ఆసిఫాబాద్, జోగులాంబ గద్వాల, వికారాబాద్, మేడ్చల్ జిల్లాలను అభినందించారు. కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో సీ సెక్షన్లు బాగా తగ్గించి, సాధారణ ప్రసవాలు పెరిగేలా చూడాలన్నారు. సబ్ సెంటర్‌వారీగా జిల్లా వైద్యాధికారులు సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు. పీహెచ్‌సీల్లో డెలివరీలు పెరగాలని, 24 గంటల పీహెచ్‌సీల్లో అన్ని వేళలా వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. ఈ విషయంలో డీఎంహెచ్‌వోలు ప్రత్యేక శ్రద్ద చూపాలన్నారు. ఎనీమియా తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

సీఎం కేసీఆర్ ఆలోచనతో ప్రారంభించిన‌ తెలంగాణ డయాగ్నొస్టిక్స్ దేశానికి రోల్ మోడల్‌గా నిలిచిందని మంత్రి హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. ఈ సేవలు ప్రజలకు అందేలా చూడాలన్నారు. 24 గంటల్లో పరీక్ష ఫలితాలు వచ్చేలా చేసి, మరుసటి రోజు పేషెంట్ ఆ ఫలితాలు వైద్యులకు చూపించే విధంగా ఉండాలన్నారు. ద‌వాఖాన‌ల‌ ప్రదేశంలో ఉండే టీ డయాగ్నొస్టిక్ బాధ్యత ఆయా ద‌వాఖాన‌ల‌ సూపరింటెండెంట్ తీసుకోవాలని ఆదేశించారు. మూడు షిఫ్టుల్లో 24 గంటల పాటు సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సేవల్లో మంచి పనితీరు కనబర్చిన మెదక్ జిల్లాను అభినందించారు. మరమ్మతులు, కొత్త బిల్డింగ్ అవసరం ఉన్న పీహెచ్‌సీల‌ వివరాలను టీఎస్ఎంఎస్ఐడీసీ ఈఈ, డీహెంహెచ్‌వో మరోసారి స‌మీక్షించి తుదిప్ర‌తిపాద‌న‌లు శుక్ర‌వారంలోగా పంపించాల‌న్నారు.

ఈ సమీక్షలో హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేత మహంతి, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ జీ శ్రీనివాస‌రావు, డీఎంఈ రమేశ్‌రెడ్డి, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి, సీఈ విజయ్ కుమార్, వివిధ అరోగ్య కార్యక్రమాల ప్రోగ్రాం ఆఫీసర్లు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

- Advertisement -