సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. బుధవారం ఆసిఫ్ నగర్ మండలంలోని ఎంజీ నగర్‌లో వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూ.1 కోటి 59 లక్షల వ్యయంతో నిర్మించిన అంధ విద్యార్థుల వసతి గృహా భవనాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ సంక్షేమ కార్యక్రమాల అమలులో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే మొదటిస్థానంలో ఉందని తెలిపారు. దేశానికే రోల్ మోడల్‌గా తెలంగాణ నిలిచందన్నారు. అంధ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకై ఈ భవనంలో అదనముగా ఒక అంతస్తు నిర్మించి కంప్యూటర్ ల్యాబ్ ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. నగరంలో ఉన్న పారిశ్రామిక, వ్యాపార యూనిట్లలో వికలాంగులు, అంధులకు ఉపాధి కల్పించే శిక్షణను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు.
కేంద్ర మాజీ మంత్రి, పార్లమెంట్ సభ్యులు బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ అంధవిద్యార్థుల వసతి గృహానికి త్రాగునీటి వసతి కల్పించుటకు వాటర్ ప్లాంట్ ఏర్పాటుకై ఎంపీ ల్యాడ్స్ నుండి రూ. 10 లక్షల నిధులను కేటాయించనున్నట్లు తెలిపారు. దివ్యాంగుల సంక్షేమం పై ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చించనున్నట్లు తెలిపారు. వికలాంగులకు 4 శాతం రిజర్వేషన్లను పక్కాగా అమలు చేయాలని అధికారులకు సూచించారు.
గతంలో నానానగర్ లో అద్దె భవనంలో అంధ విద్యార్థుల వసతి గృహాం నడిచేది. విద్యార్థులకు సౌలభ్యంగా పూర్తిస్థాయి వసతులతో ఉండేందుకు అనువుగా సొంత భవనం నిర్మించేందుకు ప్రభుత్వం రూ.1 కోటి 44 లక్షల నిధులను మంజూరు చేసింది. 3 అంతస్తులతో ప్రారంభించిన ఈ భవనమునకు మౌళిక వసతులకై నిధులు సరిపడనందున పార్లమెంట్ సభ్యులు డా.కె.కేశవరావు తన నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుండి రూ. 15 లక్షలను మంజూరు చేశారు. నగరంలోని వివిధ ప్రభుత్వ ప్రైవేటు కళాశాలల్లో చదువుతున్న 159 మంది అంధ విద్యార్థులకు ఇక్కడ వసతి కల్పిస్తున్నారు.