గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను పరిపూష్టం చేయడమే కేసీఆర్ లక్ష్యమన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణ భవన్‌లో నిజామాబాద్ జిల్లాకు చెందిన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గంప నాగేందర్, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మోహన్ రెడ్డితో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు మంత్రి కేటీఆర్,ఎంపీ కవిత సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు.
రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు మంత్రి కేటీఆర్. మంత్రి ఈటల రాజేందర్‌తో కలిసి వారం రోజుల్లో రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌తో సంయుక్త సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. వారిచ్చే సూచనలు పరిగణలోకి రైస్ మిల్లర్లకు శాశ్వతమైన ఉపశమనం కలిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. అన్నివర్గాల సంక్షేమమే ప్రధానంగా సీఎం కేసీఆర్
ముందుకు వెళుతున్నారని వెల్లడించారు.
నాలుగు సంవత్సరాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. తెలంగాణ వస్తే చీకటి అవుతుందని అవాకులు,చవాకులు పేలిన వారికి ఇవాళ సాధిస్తున్న ప్రగతితో చెంపపెట్టులాంటి సమాధానం ఇచ్చామన్నారు. ఆరు నెలల్లో కరెంట్ సమస్య పరిష్కరించామన్నారు. కేసీఆర్ పాలన బ్రహ్మాండంగా సాగుతోందన్నారు.
అన్నివర్గాలకు 24 గంటల కరెంట్ ఇస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ దేశానికి అన్నపూర్ణగా పేరుగాంచిందని కానీ ఇప్పుడు తెలంగాణ ధాన్యబండాగారంగా నిలిచిందన్నారు.
సీఎం కేసీఆర్ పనితీరుపై ప్రజలకు ఉన్న నమ్మకమే ఈ చేరికలని తెలిపింది ఎంపి కవిత. మోహన్ రెడ్డి చేరికతో టీఆర్ఎస్ మరింత బలోపేతమైందన్నారు. రైతు బాగుంటేనే రైస్ మిల్లులు బాగుంటాయన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత అందరికంటే ఎక్కువ లాభపడింది నిజామాబాద్ జిల్లానే అన్నారు. సింగూరును నిజామాబాద్‌కు లింక్ అప్ చేసి రైతులకు మంచి చేశారని తెలిపారు. కేసీఆర్ గుండె ధైర్యంతో కాళేశ్వరం త్వరగా పూర్తవుతుందని చెప్పింది ఎంపీ కవిత. కాంగ్రెస్ కలలో కూడా ఇలాంటి ప్రాజెక్టు గురించిఆలోచించ లేదన్నారు.