రెవెన్యూ ఉద్యోగులపై దాడులను ప్రోత్సహిస్తూ సోషల్ మీడియాలో జరుగుతున్న విద్వేషపూరిత ప్రచారాన్ని వెంటనే నియంత్రించాలని రాష్ట్ర అడిషనల్ డీజీపీ జితేందర్ కు వినతి పత్రం అందజేశారు రెవెన్యూ జేఏసీ నేతలు. రెవెన్యూ ఉద్యోగులపై సోషల్ మీడియాలో ప్రచారం చేసే వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రెవెన్యూ జేఏసీ కోరింది. ఈసందర్భంగా రెవెన్యూ ఉద్యోగులు మాట్లాడుతూ… ఇటీవల రెవెన్యూ ఉద్యోగులకు వ్యతిరేకంగా కొందరు పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, రెవెన్యూ ఉద్యగులపై దాడులు చేయాలని రెచ్చగొడుతున్నారని, హత్యలకు ప్రోత్సహిస్తున్నట్లు కఠిన చర్యలు తీసుకోవాలని అడిషనల్ డిజిపిని కోరినట్లు తెలిపారు.
ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లోకపోతే తహశీల్దార్ విజయారెడ్డి హత్య వంటి దారుణ ఘటనలు పునరావృతం అయ్యే ప్రమాదం ఉందన్నారు. తహశీల్దార్ విజయారెడ్డి హత్య ఘటన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగుల్లో భయాందోళనలు నెలకొన్నాయని, కావున అన్ని తహశీల్దార్ కార్యాలయాల్లో తగినంత పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి రెవెన్యూ ఉద్యోగుల భద్రతకు భరోసా కల్పించాలన్నారు. హత్య ఘటనపై సమగ్ర విచారణ జరిపించి నిందితుడి వెనుక ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. విజయారెడ్డిని అత్యంత దారుణంగా హత్య చేసిన నిందితుడి వెనుక ఇంకా ఎవరైనా హస్తం ఉండి ఉండొచ్చని తాము అనుమానిస్తున్నట్లు తెలియజేశారు.