ప్రాజెక్టుల అప్‌డేట్స్…

51
nagarjuna sagar

ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు నిండుకుండలను తలపించిన సంగతి తెలిసిందే. అయితే వర్షాలకు కాసింత బ్రేక్ రావడంతో క్రమక్రమంగా నీటి ప్రవాహం తగ్గుముఖం పడుతోంది.

శ్రీశైలం ప్రాజెక్టుకు ప్రస్తుతం 2,06,335 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తోంది. ఇప్పటికే ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టానికి చేరుకోవడంతో పది గేట్లు దిగువకు వదులుతున్నారు. కుడిగట్టు జల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలో కరెంటు ఉత్పత్తి కొనసాగుతోంది.

నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్‌కు ప్రస్తుతం 2,31,134 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు. ప్రస్తుతం 310.84 టీఎంసీలు నిల్వ ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు 589.60 మేర నీరుంది.

గోదావరి బేసిన్‌లో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు వరద కొనసాగుతోంది. డ్యామ్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులకు అదేస్థాయిలో నీరుంది. నీటి నిల్వ సామర్థం 90.31 టీఎంసీలకు పూర్తిస్థాయిలో నిల్వ ఉంది. ప్రస్తుతం డ్యామ్‌కు 50,359 క్యూసెక్కుల వరద వస్తుండగా.. 12 క్రస్ట్‌ గేట్లను ఎత్తి 37,500 క్యూసెక్కులు గోదావరిలోకి వదులుతున్నారు.