ఫ్రెండ్లీ పోలీసింగ్..8 గంటలే డ్యూటీ

191
friendly police

తెలంగాణ పోలీసు విభాగంలో భారీ మార్పులు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. లోక్ సభ ఎన్నికల తర్వాత ఖాకీలకు గుడ్ న్యూస్ అందించనుంది. వీక్లీ ఆఫ్‌తో పాటు ఇకపై 8 గంటలు డ్యూటీ ఉండేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. అంతేగాదు అదనంగా పనిచేస్తే అలవెన్సులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది.

గత నాలుగున్నరేళ్లలో సాంకేతిక పరిజ్ఞాన వినియోగంతో పాటు పీపుల్‌ ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నారు తెలంగాణ పోలీసులు. ఈ క్రమంలో వన్‌ స్టేట్‌, వన్‌ పోలీస్‌, వన్‌ ఎక్స్‌పీరియన్స్ టార్గెట్ అందుకోవాలంటే పోలీసులు ఆరోగ్యవంతమైన వాతావరణంలో పనిచేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పోలీసింగ్‌ మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం కల్పించటంతో ఇప్పటికే 10 వేల మంది ఎస్సై, కానిస్టేబుల్‌ స్థాయిలో నియమితులయ్యారు.మరో 18 వేల పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే నల్లగొండ జిల్లాలో వీక్లీ ఆఫ్స్ విధానాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టి విజయవంతంగా కొనసాగించారు. ఈ క్రమంలో పోలీసు డిపార్ట్ మెంట్ అధికారికంగా అమలు చేయనున్న ఈ కొత్త విధానంతో పోలీసులకు పని ఒత్తిడి తగ్గే అవకాశముందని భావిస్తున్నారు.