కాంగ్రెస్‌లో జోడో జోష్

298
- Advertisement -

మత ద్వేషం వద్దు-దేశ ఐక్యత ముద్దు

కాంగ్రెస్ లో ఉత్సాహాన్ని నింపిన జోడో యాత్ర

మత రాజకీయాలొద్దంటున్న రాహుల్

పిల్లలు, వృద్ధులతోనే రాహుల్ మమేకం

దేశమే వసుదైక కుటుంబం

మతాన్ని రాజకీయం చేస్తున్న బిజెపి

పదవులు త్యజించి ప్రజల్లో కొచ్చిన రాహుల్

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. యాత్ర సాగుతున్న తీరుతెన్నులు, రాహుల్ గాంధీ ప్రజలతో మమేకమవుతున్న విధానం, రాజకీయాలను పక్కనబెట్టి చిన్న పిల్లలు, వృద్ధులతో మాట్లాడుతూ యోగక్షేమాలను అడిగి తెలుసుకొంటున్న వైనం… తదితర పద్దతులన్నీ రాహుల్ గాంధీని ప్రజలు తమ మనిషిగా భావిస్తున్న సానుకూల దృక్ఫధం ముమ్మాటికీ పార్టీకి పూర్వ వైభవాన్ని తెచ్చిపెడుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో ఉన్నారు.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రాహుల్ గాంధీని తెలంగాణ రాష్ట్రంలోనికి ఆహ్వానించేందుకు కర్ణాటక- తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో కృష్ణానదిబ్రిడ్జి వద్దకు వేల సంఖ్యలో చేరుకొన్నారు. సుమారు మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల పొడవున నేతలు, కార్యకర్తలు, ప్రజలు చేరుకొని రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు రికార్డుస్థాయిలో స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ను ఇక్కడి ప్రజలు గుండెల్లో పెట్టుకొన్నారనడానికి రాష్ట్రంలోనికి స్వాగతం పలికేందుకు స్వచ్ఛందంగా వేలాదిగా తరలివచ్చిన జనసమూహమే నిలువెత్తు సాక్ష్యమని నేతలు పట్టరాని ఆనందంతో చెబుతున్నారు.

రాహుల్ గాంధీ జోడో యాత్రకు కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో లభించిన ఆదరణ కంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణే ఘనంగా ఉందని సంబరపడిపోతున్నారు. అంతేగాక జోడో యాత్ర చేపట్టిన రాహుల్ గాంధీ ఎక్కడా తనకు పదవులు కావాలనిగానీ, పదవుల కోసమే తాను యాత్ర చేపట్టినగానీ చెప్పడం లేదని, కేవలం కులాలు-మతాల వారీగా ప్రజలను విభజించి బి.జె.పి.నేతలు రాజకీయంగా పబ్బంగడుపుకొంటున్నారని, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ప్రజలందరూ సోదర భావంతో కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగ జీవించాలని, దేశం యావత్తూ వసుదైక కుటుంబం మాదిరిగా అన్నివర్గాల ప్రజలు, అన్ని మతాల ప్రజలు స్నేహపూర్వకంగా జీవించాలని మాత్రమే రాహుల్ గాంధీ ప్రజలను కోరుతున్నారని… ఎక్కడారాజకీయాలు మాట్లాడటం లేదని, అందుకే ప్రజలు రాహుల్ గాంధీకి బ్రహ్మరధం పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు.

డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రిగా పనిచేసిన కాలంలోనే ఆయనే ప్రధాని పదవిని స్వీకరించాలని రాహుల్ గాంధీని కోరినా సున్నితంగా తిరస్కరించారని, ప్రధాని పదవిలో మీరే కొనసాగాలని మన్మోహన్ సింగ్ ని కోరిన గొప్ప వ్యక్తి రాహుల్ గాంధీ అని తెలంగాణ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అంతేగాక ఎ.ఐ.సి.సి. అధ్యక్ష పదవిని రాహుల్ గాంధీ స్వీకరించాలని దేశవ్యాప్తంగా ఎన్నో వత్తిళ్ళు వచ్చాయని, జూనియర్ నేతల నుంచి ఎ.ఐ.సి.సి.లోని సీనియర్ నేతలు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సి.డబ్ల్యు.సి)లోని కాంగ్రెస్ పెద్దలందరూ ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా అధ్యక్ష పదవిని తీసుకోలేదని, గత్యంతరం లేకనే ఎ.ఐ.సి.సి. అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చిందని వివరించారు. ఇలా పదవులన్నింటినీ త్యజించిన రాహుల్ గాంధీ భారత్ జోడ్ యాత్రను నిర్వహించడానికి దారి తీసిన పరిస్థితులు, పరిణామాలను ప్రజలకు వివరిస్తూ పాదయాత్రలో ముందుకు సాగుతున్నారు గనుకనే ప్రజలు రాహుల్ గాంధీకి నీరాజనాలు పలుకుతున్నారని అంటున్నారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి దేశాన్ని పాలించే సత్తా లేదని, అస్సలు కేంద్ర ప్రభుత్వాన్ని నడపడం, పాలించడమే ఆ పార్టీకి తెలియదనే అంశాలను ప్రజలకు వివరిస్తూ, జనం కష్టాలు, బాధలను తెలుసుకొంటూ రాహుల్ పాదయాత్ర ముందుకు సాగుతోందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బి.జె.పి ప్రభుత్వానికి పాలించడమంటే ప్రజల నడ్డి విరిచే విధంగా పన్నులు, సెస్సులు, సర్ చార్జీల రూపంలో లక్షాలాది కోట్ల రూపాయలను ముక్కుపిండి వసూలు చేయడం ఒక్కటే తెలుసునని, ఇది సంక్షేమ రాజ్యమనే విషయాన్ని, మిశ్రమ ఆర్ధిక వ్యవస్థ అనే విషయాన్ని కూడా అధికారాన్ని వెలగబెడుతున్న బి.జె.పి.నేతలు మరిచిపోయారని, అందుకే జనాన్ని పన్నుల పేరుతో పీక్కుతింటున్నారని రాహుల్ గాంధీ ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్న విధానాలు విశేషంగా ఆకట్టుకొంటున్నాయని తెలిపారు.

వంటగ్యాస్ సిలిండర్ ధర 400 రూపాయల నుంచి బి.జే.పి. పాలనలో ఏకంగా 1200 రూపాయలకు పెరిగిందని, అదే విధంగా పెట్రోల్ లీటర్ ధర 60 రూపాయల నుంచి 108 రూపాయలకు పెరిగిందని, డీజిల్ లీటర్ ధర 50 రూపాయల నుంచి 97 రూపాయలకు పెరిగిందని, తద్వారా నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆకాశాన్నంటాయని రాహుల్ గాంధీ వివరిస్తుంటే ప్రజలు జేజేలు పలుకుతున్నారని వివరించారు.

పాదయాత్రలో భాగంగా రాహుల్ గాంధీ ఏ ఒక్క రాజకీయ నాయకుణ్ణి కూడా గ్రామాల్లో కలవడం లేదని, కేవలం పిల్లలు, వృద్ధులు, మహిళలతోనే ముచ్చటిస్తూ వారెదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకొంటున్నారు. బి.జె.పి. నేతలు పండుగలు, శుభకార్యాలను కూడా తమ స్వార్ధ రాజకీయాలకు వాడుకొంటున్నారని, బి.జె.పి.నేతల మాయమాటల్లో పడి ఇతరుల పట్ల ద్వేషం పెంచుకోవద్దని ప్రజలకు హితవు పలుకుతూ జోడో యాత్రను కొన సాగిస్తున్నారు. అందుకే భారత్ జోడో యాత్ర తెలంగాణ రాష్ట్రంలో సాగే 13 రోజుల పర్యటన రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గానీ, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ముమ్మాటికీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గట్టిధీమాతో ఉన్నారు. అందుకే జోడో యాత్రకు ఎవ్వరికి అప్పజెప్పిన బాధ్యతలను వారు సక్రమంగా, రెట్టించిన ఉత్సాహంతో చేస్తున్నారని గాంధీభవన్ వర్గాలంటున్నాయి.

ఇవి కూడా చదవండి..

కేసీఆర్‌తోనే మార్పు సాధ్యం

నోట్లపై దేవుళ్ల బొమ్మలు ఉండాల్సిందే

కాంగ్రెస్‌ చీఫ్‌గా ఖర్గే..బాధ్యతలు స్వీకరణ

- Advertisement -