రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క రోజే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం 169 రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభించి తెలంగాణ ప్రభుత్వం రికార్డు సృష్టించింది. 2017-18 విద్యా సంవత్సరంలో కొత్తగా 255 రెసిడెన్షియల్స్ ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా.. సోమవారం169 రెసిడెన్షియల్స్ స్కూళ్లు ప్రారంభమయ్యాయి. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన రోజే రికార్డు స్థాయిలో స్కూళ్లు ప్రారంభించిన అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు.
రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కలిపి కేవలం 259 రెసిడెన్షియల్ స్కూళ్లు మాత్రమే ఉండేవని, కేవలం మూడేళ్ళలో కొత్తగా 527 స్కూళ్లు ప్రారంభించి, మొత్తం రెసిడెన్షియల్ స్కూళ్ల సంఖ్యను 786కి తీసుకుపోతున్నామన్నారు. బాలికల విద్యను ప్రోత్సహించేందుకు, వారికి అత్యంత భద్రత, సౌకర్యం కల్పిస్తూ సగం రెసిడెన్షియల్స్ ను బాలికల కోసం కేటాయించినట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. ఒక్కో విద్యార్థిపై ఏడాదికి సగటును లక్షా 25వేల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఇంటర్మీడియట్ వరకు ఉచిత విద్య, భోజనం, వసతి కల్పిస్తున్నట్లు వెల్లడించారు. పేద విద్యార్థులు కూడా గొప్పగా చదువుకుని ఉన్నతంగా ఎదగాలన్నది తమ లక్ష్యమన్నారు. ఎన్నికల మానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కేజీ టు పీజీ విద్యా విధానానికి బడుగు, బలహీన వర్గాల రెసిడెన్షియల్ స్కూళ్లతో అంకురార్పణ జరగడం ఆనందంగా ఉందని సీఎం కేసీఆర్ అన్నారు.
169 రెసిడెన్షియల్ స్కూళ్లలో 119 బీసీ, 50 మైనారిటీ రెసిడెన్షియల్స్ స్కూళ్లు ఉన్నాయి. ఈ నెల 15న మరో 50, 19న మరో 21 మైనారిటీ రెసిడెన్షియల్స్ ప్రారంభం కానున్నాయి. ఇవి కాకుండా 15 ఎస్టీ మహిళా డిగ్రీ కాలేజీలు కూడా ఇదే విద్యా సంవత్సరం ప్రారంభం కానున్నాయి. దీంతో 2017-18 విద్యా సంవత్సరంలో ప్రభుత్వం ప్రారంభిస్తున్న రెసిడెన్షియల్స్ సంఖ్య 255కు చేరుకుంటుంది.
ప్రస్తుతం అద్దె గదుల్లో స్కూళ్లు ప్రారంభించిన ప్రభుత్వం.. రెసిడెన్షియల్ స్కూళ్ళ నిర్మాణానికి స్థలం సేకరించాల్సిందిగా కలెక్టర్లను ఆదేశించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్స్ లో దాదాపు 24 వేల మంది అధ్యాపకులు అవసరం పడుతారు. వీరిని దశల వారీగా నియమించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయింది. రెసిడెన్షియల్ విద్యార్థులకు యూనిఫారాలు సరఫరా చేయాల్సిందిగా ప్రభుత్వం తెలంగాణ స్టేట్ హండ్లూమ్ వీవర్స్ కో ఆపరేటివ్ సొసైటీని ఆదేశించింది. విద్యార్థులకు కావల్సిన పాఠ్య, నోటు పుస్తకాలను ప్రభుత్వమే సరఫరా చేస్తుంది.