కొత్త ఎక్సైజ్ విధానాన్ని తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు తెలంగాణ అబ్కారీ అధికారులు. సెప్టెంబరు 31తో గడువు ముగిచనుండటంతో అక్టోబరు నుంచి కొత్త విధానం అమలులోకి వస్తుంది. ఈ నేపథ్యంలో అబ్కారీ చట్టంలో కొంత మార్పులు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం విధివిధానాలు రూపొందిస్తున్నారు. లైసెన్స్ ఫీజులో స్వల్ప పెరుగుదలతో పాటు ప్రస్తుతం ఉన్న పర్మిట్ రూమ్‌లను ఎత్తివేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
పర్మిట్‌రూంల పేరుతో మద్యం దుకాణాల వద్దే తాగే అవకాశం ఇవ్వడంతో అనేక సమస్యలు వస్తున్నాయి. చీకటిపడిందంటే చాలు వైన్స్ షాపుల ముందు భారీ రద్దీ కనిపించడంతో పాటు జనావాస ప్రాంతాల్లో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది. అందుకే పర్మిట్‌రూంలను ఎత్తివేయాలని అధికారులు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం రాష్ట్రంలో 2216 మద్యం షాపులు ఉన్నాయి. లైసెన్సు ఫీజు రూపంలో ప్రభుత్వానికి 1360 కోట్ల ఆదాయం వచ్చింది. 50 వేల లోపు జనాభా ఉన్న పట్టణాల్లో మద్యం దుకాణాల లైసెన్సు ఫీజు రూ. 45 లక్షలు ఉండగా,50 వేల నుంచి 5 లక్షల జనాభా ఉన్న పట్టణాల్లో రూ. 55 లక్షలు,5 నుంచి 20 లక్షల జనాభా ఉన్న నగరాల్లో రూ. 85 లక్షలు లైసెన్స్ ఫీజు ఉంది. 20 లక్షల జనాభా దాటిన నగరాల్లో రెండు సంవత్సరాలకు గాను రూ. 1.1 కోట్లు లైసెన్స్ ఫీజు ఉంది. అయితే కొత్తగా తీసుకొచ్చే అబ్కారీ విధానంలో లైసెన్స్ ఫీజు స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది.