రెవెన్యూలో భారీ ప్రక్షాళన..!

500
cm kcr
- Advertisement -

రెవెన్యూలో భారీ ప్రక్షాళన దిశగా శరవేగంగా అడుగులు పడుతున్నాయి. రెవెన్యూలో ప్రక్షాళన తప్పదంటూ సీఎం కేసీఆర్ పలు సందర్భాల్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేగాదు రెవెన్యూ ఉద్యోగులకు ఎవరు లంచాలు ఇవ్వొద్దంటూ పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే రికార్డ్స్‌ ఆఫ్‌ రైట్స్‌ చట్టానికి బదులు కంక్లూజివ్‌ టైటిల్‌ చట్టం తీసుకొచ్చి పటిష్ఠ వ్యవస్థను ఏర్పాటుచేయాలని కూడా భావించారు. దీనికోసం పలువురు ఐఏఎస్‌ అధికారులు అధ్యయనం కూడా చేపట్టారు.ఇవాళ జరిగే కేబినెట్‌ భేటీలో రెవెన్యూలో ప్రక్షాళనకు సంబంధించి చర్చకు వచ్చే అవకాశం ఉంది.

ఇందులో భాగంగా ఒకేచోట సుదీర్ఘకాలంగా విధులు నిర్వర్తిస్తున్న అధికారులు, ఉద్యోగులను బదిలీ చేయాలని సీఎం భావిస్తున్నారు. ముందు ఒకే జిల్లా, ఒకే డివిజన్‌లో ఎక్కువకాలం నుంచి పనిచేస్తూ పక్కపక్కనే పోస్టింగ్‌లు పొందుతున్న వారిని కదిలించాలని నిర్ణయించినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలోనే జూనియర్‌ అసిస్టెంట్‌ నుంచి తహసీల్దారు స్థానం వరకు వారు పనిచేసిన, పనిచేస్తున్న, సీనియారిటీతో పాటు పూర్తి వివరాలు తెలపాలంటూ భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) కార్యాలయం సోమవారం అత్యవసర ఆదేశాలు జారీచేసింది. ఈనెల 20వ తేదీలోగా పూర్తి వివరాలు పంపాలంటూ అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసింది. ఉద్యోగంలో చేరిన నాటి నుంచి పదోన్నతులు, విధుల వివరాలను ప్రభుత్వం సేకరిస్తుండటం తాజాగా చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -