తెలంగాణలో వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతోపాటుగా జడ్చర్ల, కొత్తూరు, అచ్చంపేట, నకిరేకల్, సిద్దిపేట మున్సిపాలిటీలకు ఎన్నికల నిర్వహణ హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. కరోనా నేపథ్యంలో ఈ ఎన్నికలు ఎన్నికలు జరుగుతాయా? లేదా? అన్న గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో షెడ్యూల్ ప్రకారమే మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి స్పష్టం చేశారు. కొవిడ్ నిబంధనలు కట్టుదిట్టంగా అమలు చేస్తామని, అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకుంటామని ప్రభుత్వం ఎస్ఈసీకి స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అధికారులతో ఎస్ఈసీ చర్చించి.. ఎన్నికల ప్రక్రియ కొనసాగించాలని నిర్ణయించింది.
ఈ సందర్భంగా ఎస్ఈసీ పార్థసారథి మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియ కొనసాగించాలని.. రాష్ట్ర ప్రభుత్వం కోరిందని తెలిపారు. అధికారులతో చర్చించి ఎన్నికల ప్రక్రియ కొనసాగింపునకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కొవిడ్ నిబంధనలు విధిగా పాటించాలని పేర్కొన్నారు. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు బహిరంగ సభలు, ర్యాలీలపై నిషేధం విధించినట్లు స్పష్టం చేశారు. పోలింగ్‌కు 72 గంటల ముందే ప్రచారం ఆపాలని ఆదేశించారు. దీంతో 27వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ మున్సిపాలిటీలకు 30వ తేదీన పోలింగ్ జరగనుంది. మే 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.