కాంగ్రెస్‌కు భారీ షాక్.. రాజీనామా చేయనున్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి..

145
- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్‌కు మరో భారీ షాక్ తగలనుంది. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఈరోజు పార్టీకి రాజీనామా చేయనున్నారు. త్వరలోనే ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటారని కూడా సమాచారం. అయితే, తాను ఏ పార్టీలోనూ చేరబోనని, స్వతంత్రంగానే ఉంటానని ఓ మీడియా ఛానెల్‌తో చెప్పారు. పార్టీ కోసం ఎంతో కష్టపడిన తనను అవమానించారని, తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా పార్టీలోని కొందరు కుట్రలు చేశారని, ఇవన్నీ తట్టుకోవడం ఇక తన వల్ల కాకపోవడం వల్లే పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్టు మీడియాతో మాట్లాడుతూ జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. రాజీనామా లేఖను నేడు అధిష్ఠానానికి సమర్పిస్తానని చెప్పారు. పార్టీని వీడడానికి గల కారణాలను వివరిస్తూ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాయాలని కూడా జగ్గారెడ్డి భావిస్తున్నారు.

అయితే గత మంగళవారం సంగారెడ్డిలో జరిగిన సేవాలాల్‌ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. సేవాలాల్‌ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంతో పాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు ఎంతో బాగున్నాయంటూ సీఎం కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. పెండ్లీడుకొచ్చిన ఆడపిల్లలు తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ గొప్ప ఆలోచనతో కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టారని, పథకం కింద ప్రభుత్వ పరంగా రూ.1,01,116 అందజేయడం సంతోషకర విషయమని కొనియాడారు.

తాను కాంగ్రెస్‌ ఎమ్మెల్యేను అయినప్పటికీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రశంసిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని ప్రశంసించడంపై మింగుడుపడని రాష్ట్ర నాయకత్వం ఆయనపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నట్లుగా జగ్గారెడ్డి వర్గీయులు అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -