త్వరలో మైనారిటీ బంధు..?

42
kcr

తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన దళితబందు పథకంతో దళితుల పేరుతో రాజకీయం చేస్తున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌లకు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయింది. 75 ఏళ్ల స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఎప్పుడూ లేనంతగా దళితుల సామాజిక, ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేసే చారిత్రాత్మక దళితబంధు పథకం తీసుకువచ్చిన సీఎం కేసీఆర్‌పై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే ప్రతీ విషయంలో దిగజారుడు రాజకీయాలు చేసే బండి సంజయ్‌లు, రేవంత్ రెడ్డిలు దళితబంధు పథకాన్ని కేవలం హుజురాబాద్ ఎన్నికల్లో ఓట్ల కోసమే తీసుకువచ్చారని, ఎన్నికల తర్వాత పథకాన్ని ఆపేస్తారంటూ దుష్ప్రచారం మొదలుపెట్టారు.

అయితే సీఎం కేసీఆర్ మాత్రం దళితబంధును రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని, అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. అంతే కాదు దళితులతో పాటు అన్ని కులాల్లోని పేదలకు దళితబంధు తరహాలో పథకాలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. తాజాగా సీఎం కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. దళితబంధు తరహాలో మైనారిటీ బంధు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయమై ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ మాట్లాడుతూ దళిత బంధు తరహాలో పేద ముస్లిం కుటుంబాలకు కూడా నగదు బదిలీ లబ్ధి చేకూర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

‘తెలంగాణలో ముస్లింలు’ అనే అంశంపై జరిగిన చర్చా వేదికలో ఒవైసీ మాట్లాడుతూ మైనారిటీ బంధును తెరపైకి తెచ్చారు. తెలంగాణలో మొత్తం 8.8 లక్షల ముస్లిం కుటుంబాలు ఉన్నాయని, అందులో 2 శాతం మంది అత్యంత దుర్భర జీవనం గడుపుతున్నారని చెప్పారు . వారిలో కనీసం ఒక శాతం కుటుంబాలకైనా దళిత బంధు తరహా పథకం వర్తింపజేయాలని కోరారు. ఒక శాతం అంటే 8,800మంది ముస్లిం కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున సాయం అందిస్తే 880 కోట్ల రూపాయలవుతుంది. అంటే తెలంగాణ బడ్జెట్ లో అది 0.8 శాతం కూడా మించదని ఒవైసీ గణాంకాలతో సహా వివరించారు. ఒకే విడతగా సాధ్యం కాని పక్షంలో రెండు విడతలుగా నగదు బదిలీ చేయాలని ఒవైసీ సీఎం కేసీఆర్‌ను కోరారు. . నిజంగా చెప్పాలంటే దళితులతో పాటుగా రాష్ట్రంలో మైనారిటీ వర్గాల్లో మెజారిటీ శాతం అత్యంత దుర్భర పరిస్థితుల్లో బతుకీడుస్తున్నారు. ఇప్పటికే దళితబంధుతో సహా అన్ని వర్గాలకు బంధులను అమలు చేయాలని భావిస్తున్న సీఎం కేసీఆర్ మైనారిటీ బంధు డిమాండ్‌పై సానుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా దళితబంధు తరహాలో మైనారిటీ బందు కూడా తీసుకువస్తే తెలంగాణలో ప్రతిపక్షాల దుకాణం బందు కావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.