దేశరాజ‌ధాని ఢిల్లీలో తెలంగాణ మంత్రుల ప‌ర్యట‌న..

125
Ministers visit Delhi
- Advertisement -

దేశరాజ‌ధాని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, శ్రీనివాస్ గౌడ్, స‌త్య‌వ‌తి రాథోడ్ ప‌ర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఢిల్లీలో కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి రాఘవేంద్ర సింగ్, అర్కియాల‌జి డీజీ విద్యావ‌తితో మంత్రులు స‌మావేశ‌మైయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీలు బండ ప్రకాశ్, వెంక‌టేష్ నేత‌, మాలోత్ క‌విత‌ హాజరైయ్యారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ నగరాల్లో మ్యూజియంల ఏర్పాటు చేయాలని వినతి చేశారు. హైదరాబాద్ గోల్కొండ కోటలో సౌండ్ అండ్ లైటింగ్ షో వేదిక మార్చాలని మంత్రుల బృందం కోరింది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో కల్చరల్ ఆడిటోరియం ఏర్పాటుకు ప్రతిపాదనలను సమర్పించారు. అలాగు రామ‌ప్ప దేవాల‌యానికి యూనెస్కో గుర్తింపున‌కు కృషి చేయాలని మంత్రులు తెలిపారు. అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ నేతృత్వంలో సాంస్కృతిక వైభవం కోసం కృషి చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం కేంద్రానికి అత్యధిక పన్నులు చెల్లిస్తున్న ఆశించినంతగా సహకారం రావటం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం నిర్లక్ష్యానికి గురై ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఒక్క జాతీయ ప్రాజెక్టు ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రతిపాదనలపై సానుకూల స్పందన వచ్చిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు మాట్లాడుతూ.. రామ‌ప్ప దేవాల‌యానికి ప్ర‌పంచ స్థాయిలో గుర్తింపు రావాల్సిన అవ‌స‌రం ఉంది. ఖిలా వ‌రంగ‌ల్, వేయిస్థంబాల అల‌య అభివృద్ధి ప‌నులు ముందుకు సాగ‌డం లేదు. చ‌రిత్ర క‌లిగిన దేవాల‌యాల అభివృద్ధికి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరాము. నిధుల విడుద‌ల‌, ప‌నులు వేగం పెంచాల‌ని విజ్ఞప్తి చేశాం. సర్ధార్ పాపన్న కోట, జఫర్గడ్ కోట, పాలకుర్తి బమ్మెర పోతన సమధుల అభివృద్ధి, పాలకుర్తి అలయాభివృద్ది చేయాలని కోరామని మంత్రి ఎర్ర‌బెల్లి తెలిపారు.

ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. యూనెస్కో పంపిన సాంకేతిక నిపుణుడు కూడా రామ‌ప్ప ఆల‌యం గుర్తింపున‌కు అవ‌కాశం ఉన్న‌ది అని చెప్పాడు. యూనెస్కో వారికి కావాలిసిన అన్ని ర‌కాల స‌మాచారం అందించాం. జూన్‌లో జ‌ర‌గాల్సిన యూనెస్కో స‌మావేశం క‌రోనా కారణంగా వాయిదా ప‌డింది. త్వరలోనే ప్యారిస్‌లో సమావేశం జరగబోతోందని తెలిపారు. ఎలాగైనా సరే ఈసారి రామప్పకు యూనెస్కో గుర్తింపు లభించేలా కేంద్రంతో కలిసి చర్యలు తీసుకుంటున్నాం. మ‌రికొంత స‌మాచారం అడిగితే నేడు స‌మ‌ర్పించాము. రామ‌ప్ప దేవాల‌యానికి యునెస్కో గుర్తింపు కోసం కేంద్రం కూడా కృషి చేస్తోంది. రామ‌ప్ప‌, వేయి స్థంబాల దేవాలయంలో అభివృద్ధి ప‌నులు అల‌స్యం అవుతున్నాయి. ఇదే అంశాన్ని అర్కియాల‌జి స‌ర్వే ఆఫ్ ఇండియా డిజికి వివ‌రించామని..అన్ని అంశాల‌పై వారు సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్సీ పోచంపల్లి పేర్కొన్నారు.

- Advertisement -