పత్తి రైతులను ఇబ్బంది పెట్టొద్దు.. సీసీఐకి మంత్రి లేఖ..

39
Niranjan Reddy

పత్తి కొనుగోళ్లపై సీసీఐ ఆంక్షలు ఎత్తివేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం సీసీఐ సీఎండీకి లేఖ రాశారు. పత్తి కోనుగోలుకు పరిమితి విధిస్తే రైతులు ఇబ్బంది పడే అవకాశముందని, రైతుల సమస్యను దృష్టిలో ఉంచుకొని పరిమితిని ఎత్తివేయాలని కోరారు. నిలువ సామర్ద్యం ఉన్న కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బంది లేదు. నిలువ సామర్ద్యం లేని కొనుగోలు కేంద్రాలు ఉన్న చోట నుండి సమీప కేంద్రాలకు రైతులను మళ్లించే విధంగా చర్యలు తీసుకుంటామని.. కాబట్టి ఆంక్షలు విధించనవసరం లేదు మంత్రి పేర్కొన్నారు.

కొనుగోళ్లపై పరిమితి నిర్దేశించడం సరికాదని, జనవరి నెలాఖరు వరకు ఆంక్షలన్నీంటిని ఎత్తివేయాలని మంత్రి సూచించారు. పంట చేతికొచ్చే సమయంలో ఆంక్షలు విధించడంతో రైతులు మద్దతు ధర దక్కదనే ఆందోళనకు లోనవుతున్నారని మంత్రి పేర్కొన్నారు. వరంగల్, మహబూబ్ నగర్ రీజియన్లలో రోజుకు 15 వేల బేళ్లు, ఆదిలాబాద్ రీజియన్‌లో రోజుకు 10 వేల బేళ్లు మాత్రమే కొనాలని అధికారులకు సీసీఐ ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. అయితే కొనుగోలు కేంద్రాల్లో రోజుకు కేవలం 100 నుంచి 800 బేళ్లకు మించి కొనుగోలు చేసేది లేదని సీసీఐ ( కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా) తాజాగా నిర్ణయం తీసుకుంది. మద్దతు ధరలోనూ రూ. 100 కోత విధించిన విషయం తెలిసిందే.