రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ సంస్థల్లో కీలకమైన మేయర్, చైర్‌పర్సన్ ఎన్నికలు ఈ నెల 16న నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయబడుతుంది. మొత్తం సభ్యుల్లో కనీసం సగం మంది హాజరు కావడం (కోరం) తప్పనిసరి. కోరం నిండకపోతే ఎన్నికను వాయిదా వేయాల్సి ఉంటుంది. దీంతో రాజకీయ పార్టీల్లో కదలికలు వేగంగా సాగుతున్నాయి.
నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు 16న ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కలెక్టర్ల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు మేయర్ లేదా చైర్‌పర్సన్ ఎన్నిక నిర్వహిస్తారు. తర్వాత డిప్యూటీ మేయర్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నిక జరుగుతుంది.
ఎన్నికైన వార్డు సభ్యులకే మేయర్ లేదా చైర్‌పర్సన్ పదవులకు పోటీ చేసే అర్హత ఉంటుంది. రిజర్వేషన్ అమల్లో ఉన్నచోట ఆయా వర్గాలకు చెందినవారే పోటీ చేయాలి. ఎన్నిక రహస్య ఓటింగ్ ద్వారా కాకుండా చేతులెత్తి ఓటు వేయడం ద్వారా జరుగుతుంది. ఒకే అభ్యర్థి ఉంటే ఏకగ్రీవంగా ప్రకటిస్తారు. ఎక్కువ మంది ఉంటే అధిక ఓట్లు పొందినవారిని విజేతగా ప్రకటిస్తారు. ఓట్లు సమానంగా వచ్చినపక్షంలో లాటరీ ద్వారా నిర్ణయం తీసుకుంటారు.
Also Read:‘ది ప్యారడైజ్’..రిలీజ్ డేట్ ఫిక్స్
పార్టీలు తమ సభ్యులకు విప్ జారీ చేస్తాయి. విప్ ఉల్లంఘిస్తే సభ్యత్వ రద్దు జరుగుతుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎక్స్-అఫీషియో సభ్యులుగా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.

