తల్లీబిడ్డలకు కేసీఆర్ కిట్!

250
KCR
- Advertisement -

ప్రజారోగ్యంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సర్కారీ దవఖానాలను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా గర్భిణుల కోసం సరికొత్త పథకాన్ని తీసుకురానుంది. గర్భిణులకు గౌరవం దక్కేలా, ప్రసవాలన్నీ సర్కార్ దవాఖానలో జరిపించి మాతాశిశు సంరక్షణకు పెద్దపీట వేసేలా కార్యాచరణ సిద్ధం చేసింది. అంతే కాకుండా తల్లీబిడ్డలకు అవసరమైన వస్తువులతో కూడిన కిట్‌ను అందజేయాలని భావిస్తున్నది. వందశాతం ప్రసవాలు సర్కారు దవాఖానల్లోనే జరుగాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేసిన దిశానిర్దేశం మేరకు వైద్యారోగ్యశాఖ వడివడిగా అడుగులు వేస్తున్నది. కేసీఆర్ ఆదేశాలతో తమిళనాడులో పర్యటించి అక్కడి వైద్య విధానాలపై అధ్యయనం చేసిన అధికార యంత్రాంగం.. అక్కడ అమలవుతున్న విధానం కన్నా మెరుగైన పథకాన్ని రూపొందించాలని నిర్ణయించింది.

 KCR

తమిళనాడులో గర్భిణులకు ముత్తు లక్ష్మీరెడ్డి మెటర్నిటీ బెనిఫిట్ స్కీంలో భాగంగా 12 వేలు ఇస్తుండగా, మన రాష్ట్రంలోనూ ఇదే తరహా విధానాన్ని అమలు చేయనున్నది. దీనికి మరో మూడు వేలు అదనంగా జోడించి 15వేలు ఇవ్వాలని నిర్ణయించింది. గర్భిణులు మూడోనెల నుంచి ప్రసవం వరకు పరీక్షలు చేయించుకోవడం పూర్తి కాగానే తొలివిడతగా 5 వేలు, ప్రసవం కాగానే మరో విడతగా 5 వేలు, ఆ తర్వాత బేబీ ఇమ్యూనైజేషన్ కు 5వేలు చొప్పన మొత్తంగా 15 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. దీనికోసం ఎంత ఖర్చవుతుందో బడ్జెట్ రూపొందించాలని మంత్రి లక్మారెడ్డి అధికారులను ఆదేశించారు. గర్భంతో ఉన్నప్పడు మహిళలు పనులు చేసుకునే వీలుండదు కాబట్టి ఆర్థికంగా ఇబ్బందులు పడుతారనే ఉద్దేశంతో ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ప్రసవాలు చేసిన డాక్టర్లకూ ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్టు మంత్రి లక్ష్మారెడ్డి ప్రకటించారు.

తమిళనాడులో అమ్మకిట్ పేరుతో నవజాత శిశువులకు కావాల్సిన మొత్తం 16 వస్తువులను అందజేస్తున్నారు. ఈ విధానాన్ని మరింత మెరుగుపరిచి రాష్ట్రంలో అమలుచేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతోపాటు, అదనంగా తల్లికి కూడా మూడు నెలలకు అవసరమైన వస్తువులను కిట్ రూపంలో ఇవ్వాలని భావిస్తున్నది. దీనికి కేసీఆర్ కిట్ అని పేరు పెట్టాలనే ప్రతిపాదన ఉన్నట్టు సమాచారం. ఈ కిట్ల అమలుకు ఎంతఖర్చు అవుతుందో బడ్జెట్ రూపొందించాలని సమీక్షలో మంత్రి లక్మారెడ్డి అధికారులను ఆదేశించారు. బేబీ కిట్‌ లో బేబీ ఆయిల్, బేబీ పౌడర్, మస్కిటో కిట్, చిన్న బెడ్‌ తో పాటు నవజాత శిశువులకు అవసరమయ్యే దాదాపు 80 వరకు వస్తువులుండేలా చర్యలు తీసుకుంటున్నారు. తల్లికి ఇచ్చే కిట్‌ లో బాలింతలకు అవసరమయ్యే వివిధ వస్తువులను అందించాలని భావిస్తున్నారు. ఈరెండింటినీ కేసీఆర్ కిట్ పేరుతో తల్లీబిడ్డలకు అందించనున్నారు.

మరోవైపు రాష్టవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లోని దవాఖానాల్లో 20 ఐసీయూలు ఏర్పాటు చేయాలని సమావేశంలో మంత్రి లక్ష్మారెడ్డి నిర్ణయించారు. ఇప్పటికే కరీంనగర్, సిద్దిపేట, మహబూబ్‌ గర్‌ లోని ప్రభుత్వ దవాఖానల్లో ఐసీయూలు ఉండగా, మరో 17 కొత్తవి ఏర్పాటు చేసేందుకు కావాల్సిన ప్రతిపాదనలు పంపాలని మంత్రి ఆదేశించారు. ఇప్పటివరకు ఖాళీగా ఉన్నపోస్టులను భర్తీ చేసేందుకు వైద్యారోగ్యశాఖ కసరత్తు చేస్తున్నది. 2,118 వైద్యులు, సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది తదితర పోస్టులను భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. వైద్యసేవల కోసం ఏయే పోస్టులు కొత్తగా అవసరమో గుర్తించిన ప్రభుత్వం వాటిపై దృష్టి సారించింది. దాదాపు మరో మూడువేల పోస్టుల వరకు అవసరం ఉంటుందని వైద్యారోగ్యశాఖ అంచనాకు వచ్చింది. వీటికి సంబంధించి సీఎం కేసీఆర్ ఆమోదం ఇవ్వగానే వెంటనే కార్యాచరణ మొదలు పెట్టాలని మంత్రి సూచించారు.

మరోవైపు గిరిజన ప్రాంతాలకు పరిమితమైన అమ్మ ఒడి వాహన సేవలను రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తేవాలని అధికారులకు మంత్రి లక్మారెడ్డి సూచించారు. దీనికోసం ఎంత ఖర్చవుతుందో ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. కావాల్సిన సిబ్బంది? ఖర్చు తదితర అంశాలన్నీ నివేదించాలని సూచించారు.

- Advertisement -