కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్ తెలంగాణలో ప్రశాంతంగా కొనసాగుతోంది. అన్నివర్గాల ప్రజలు బంద్‌లో పాల్గొంటుండగా రాష్ట్రవ్యాప్తంగా ఆర్‌టీసీ బస్‌లు డిపోలకే పరిమితమయ్యాయి. తెల్లవారు జాము నుంచే డిపోల ఎదుట టీఆర్‌ఎస్, కాంగ్రెస్, వామపక్ష పార్టీల నేతలు నిరసన తెలిపారు.
ఉమ్మడి జిల్లాలోని హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి, అద్దంకి -నార్కెట్ పల్లి రహదారి, హైదరాబాద్ – సాగర్ రహదారి, హైదరాబాద్-వరంగల్ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ బంద్‌కు కార్మిక సంఘాలు, వాణిజ్య సంస్థలు మద్దతు తెలిపాయి. జిల్లాలో బంద్ నేపథ్యంలో ఎనుమామల సహా అన్ని మార్కెట్ యార్డులకు సెలవు ప్రకటించారు. కాళోజీ ఆరోగ్య వర్సిటీ, కాకతీయ వర్సిటీలో పరిధిలో జరగాల్సిన పరీక్షలు వాయిదా వేశారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా ఆర్టీసీ బస్‌లు డిపో దాటలేదు. ఖమ్మం డిపో ఎదుట టీఆర్‌ఎస్ శ్రేణులు, పలు పార్టీ నాయకులు నిరసనలో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బస్టాండ్‌లన్నీ ప్రయాణికులు లేక బోసిపోయాయి. అలాగే హైదరాబాద్‌లో బంద్‌కు ఆర్టీసీ సంఘాలు సైతం మద్దతు ప్రకటించాయి.