తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, పుట్టుక నుంచి పెళ్లి వరకు అండగా నిలుస్తున్న మహా నాయకుడు మన ముఖ్యమంత్రి కేసిఆర్ అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సోమవారం హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపురం మండలంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి పర్యటించారు.
పర్యటనలో భాగంగా 74 మంది లబ్థిధారులకు, 74 లక్షల 8వేల 584 రూపాయల విలువైన కళ్యాణలక్ష్మి, షాదీముభారక్ చెక్కులతో పాటు 11 మందికి 3 లక్షల 70 వేల రూపాయల విలువైన చెక్కులను అందజేశారు.పేద ఆడబిడ్డల పెళ్లికి కళ్యాణలక్ష్మి పథకం ద్వారా 1 లక్షా 116 రూపాయలు అందజేసి, మేనమామగా వారి గుండెల్లో నిలిచారని మంత్రి అన్నారు. పుట్టగానే కేసిఆర్ కిట్ అందించి, పెళ్లి సమయంలో కళ్యాణలక్ష్మి చెక్కును అందజేసి పేద కుటుంబాల గుండెల్లో సిఎం కేసిఆర్ గారిని పెట్టుకున్నారని మంత్రి దయాకర్‌రావు అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తున్నామని అన్నారు. ప్రగల్భాలు పలికే కేంద్ర ప్రభుత్వం విభజన హామీలను నెరవేర్చకుండా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. కరోనా కష్టకాలంలో రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా.. సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్న ఏకైక రాష్ట్ర ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వమని అన్నారు. బిజేపి పాలిత రాష్ట్రాల్లో పేద ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మీ లాంటి పథకం ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించారు. ఆసరా పెన్షన్లతో వృద్దులకు అండగా నిలిచి, గౌరవాన్ని పెంపొందించిన మహానీయుడు మన సిఎం కేసీఆర్ గారేనని అన్నారు. సిఎం కేసీఆర్ అండతో హుజురాబాద్ నియోజకవర్గంలో అన్ని విధాలుగా అభివృద్ధి జరిగిందని, ఇంకా అభివృద్ధి చేసుకునేందుకు ముఖ్యమంత్రికి ప్రజలంతా అండగా ఉండాలని మంత్రి ఎర్రబెల్లి పిలుపునిచ్చారు.