నేతన్న బీమా కార్యక్రమంపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తొలిసారిగా నేతన్నల కోసం నేతన్న బీమా పథకంను అమలు చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 7న జాతీయ చేనేత దినోత్సవం రోజున ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా టెక్స్‌టైల్ శాఖ కార్యదర్శి బుద్ధ ప్రకాశ్‌తో పాటు ఉన్నతాధికారులతో కార్యక్రమం ప్రారంభానికి సంబంధించిన ఏర్పాట్లపై మంత్రి సమీక్షించారు.
ఇప్పటికే బీమా కార్యక్రమానికి సంబంధించి క్షేత్రస్థాయిలో నేతన్నలకు సమాచారం తమ శాఖ తరఫున అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఉన్న సుమారు 80వేల మంది నేతన్నలకు లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారులు మంత్రి కేటీఆర్‌కు వివరించారు. ఈ సందర్భంగా బీమా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన మంత్రి కేటీఆర్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు.