మా నాన్నను, బాబాయిని శిక్షించాలి: అమృత

249
- Advertisement -

మిర్యాలగూడ పట్టణంలో శుక్రవారం జరిగిన పెరుమాళ్ల ప్రణయ్‌ పరువు హత్య గురించి తెలిసిందే. ఈ విషయం గురించి ప్రణయ్‌ భార్య అమృత వర్షిణి పలు విషయాలను వెల్లడించింది.. మా నాన్నే నా భర్త ప్రణయ్‌ను హత్య చేయించాడు. నన్ను కూడా పలుమార్లు బెదిరించాడు. ఆయనకు తప్ప మరెవరికీ ఈ పని చేయించాల్సిన అవసరం లేదు..’ అని అమృత తెలిపారు. పట్టణంలోని జ్యోతి ఆసుపత్రి అత్యవసర వార్డులో చికిత్స పొందుతున్న ఆమె.. శనివారం భర్త మరణించిన విషయం తెలిసి బోరున విలపించింది. తాను ఇష్టపడి పెళ్లి చేసుకున్న వ్యక్తిని తండ్రి మారుతీరావు, బాబాయ్‌ శ్రవణ్‌ కలిసి హత్యచేయించి ఉంటారని మీడియాతో మాట్లాడుతూ ఆరోపించింది. నా తండ్రి మంచిగా ఉన్నట్టు నటిస్తూ కళ్లెదుటే నా భర్తను కిరాయి హంతకులతో హత్య చేయిస్తాడని అనుకోలేదు అని అమృత వర్షిణి వాపోయింది.

Telangana honour killing

ప్రేమ వివాహం తన తండ్రికి మొదటి నుంచీ ఇష్టం లేదని, బెదిరింపులకు పాల్పడుతూనే చివరకు ఈ దారుణానికి ఒడిగట్టినట్టు కన్నీటి పర్యంతమైంది. తన తండ్రి కనిపిస్తే తానే చంపేస్తానని అమృత వర్షిణి ఆగ్రహంతో వ్యక్తం చేసింది. ఇక తన భర్త హత్యే ఆఖరి పరువు హత్య కావాలని, ఇకపై ఇటువంటి కుల దురహంకార హత్యలు జరుగకుండా ఉద్యమిస్తానని తెలిపింది. తన భర్త మరణిస్తే, తాను తిరిగి వారి వద్దకు వెళతానని తల్లిదండ్రులు అనుకొని ఉండవచ్చని, కానీ, అది ఈ జన్మకు జరగదని చెప్పింది. మిర్యాలగూడ సెంటర్ లో తన భర్త విగ్రహాన్ని ఏర్పాటు చేయించి, నగరంలో కులపిచ్చి పట్టుకున్న పెద్దలకు ఈ ఘటన నిత్యమూ గుర్తొచ్చేలా చేస్తానని చెప్పింది. తన కడుపులో పెరుగుతున్న బిడ్డను భర్త ప్రేమకు గుర్తుగా పెంచుకుంటానని తెలిపింది. తన భర్తను హత్య చేయించిన తండ్రి మారుతీరావు, బాబాయి శ్రవణ్‌ను చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని తెలిపింది.

ఈ కేసులో దర్యాప్తు వేగవంతం చేశామని ఎస్పీ ఏవీ రంగనాథ్ విలేకరులకు తెలిపారు. అమృత వర్షిణితో మాట్లాడిన ఆయన.. పలు విషయాలను ధ్రువీకరించుకున్నారు. నిందితులు పోలీసులు అదుపులో ఉన్నట్టు జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు. హత్య కేసులో తిరునగరు మారుతీరావు, తిరునగరు శ్రవణ్‌కుమార్‌తోపాటు కిరాయి హంతకులను పట్టుకునేందుకు ఇప్పటికే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. నిందితులను మరికొద్ది గంటల్లో పట్టుకుని మీడియా ముందుకు ప్రవేశపెడ్తామని ఎస్పీ తెలిపారు.

- Advertisement -