రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ చెల్లింపు విషయంలో తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఘాటు ఆదేశాలు జారీ చేసింది. పదవీ విరమణ చేసిన ఉద్యోగికి రావలసిన ప్రయోజనాలను సకాలంలో అందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఒక కీలక కేసులో బాధితుడికి అనుకూలంగా తీర్పునిచ్చింది.
రంగారెడ్డి జిల్లా కోర్టులో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహించిన విజయ్ కుమార్ అనే ఉద్యోగి ఆరు నెలల క్రితం పదవీ విరమణ పొందారు. తనకు రావలసిన 90 లక్షల రూపాయల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఆయన అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో చివరకు హైకోర్టును ఆశ్రయించారు. తన పదవీ కాలం ముగిసి ఆరు నెలలైనా ప్రభుత్వం నుంచి రావాల్సిన నగదు అందలేదని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం, ఆర్థిక శాఖపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. విజయ్ కుమార్‌కు రావలసిన పూర్తి స్థాయి బెనిఫిట్స్‌ను రాబోయే 4 వారాల్లోగా చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ ఈ నాలుగు వారాల గడువులోగా చెల్లింపులు పూర్తి కాకపోతే, టోకెన్ జారీ చేసిన తేదీ నుండి 18 శాతం వార్షిక వడ్డీని కలిపి చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
ఈ మేరకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాను న్యాయస్థానం ఆదేశించింది.పెన్షన్ డబ్బుల కోసం ఏళ్ల తరబడి వేచి చూస్తున్న వేలాది మంది రిటైర్డ్ ఉద్యోగులకు ఈ తీర్పు ఒక ఆశాకిరణంగా మారింది.
ALso Read:పిల్లలకు మాటలు ఆలస్యమవ్వడం ఆటిజమా?

