తెలంగాణలో 1200 ఎంబీబీఎస్‌ సీట్లు: హరీశ్‌

169
harishrao
- Advertisement -

బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా 8 మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు ప్రారంభంకానున్నాయని ప్రకటించారు. ఈ కాలేజీల్లో 1200 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఒకట్రెండు రోజుల్లో అడ్మిషన్ కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తామని అన్నారు. ఇవి బి కేటగిరి సీట్లలో 85% స్థానికులకు ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

స్వరాష్ట్రం ఏర్పడితేనే మెడికల్ కాలేజీలు వస్తాయని ఉద్యమ సమయంలో కన్న కల ఇప్పుడు నిజమవుతోందని హరీష్ అన్నారు. సమైక్య రాష్ట్రంలో కేవలం వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్ లో మాత్రమే మూడు మెడికల్ కాలేజీలు వచ్చాయని, తెలంగాణ ఏర్పడిన తర్వాత గత ఏడేండ్లలో 12 మెడికల్ కాలేజీలు వస్తే వాటిలో 8 ఈ ఏడాదే తీసుకొచ్చామని స్పష్టం చేశారు. వీటితో కలుపుకొని ప్రస్తుతం రాష్ట్రంలో 17 వైద్య కళాశాలలు ఉన్నాయని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 157 మెడికల్‌ కాలేజీలు మంజూరు చేసినా తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన 8 మెడికల్ కాలేజీల కోసం సీఎం కేసీఆర్ రూ.4,080కోట్లు మంజూరు చేసినట్లు హరీష్ రావు ప్రకటించారు. రాష్ట్రం ఏర్పడే నాటికి ప్రభుత్వ కాలేజీల్లో కేవలం 850 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉండేవని, ప్రస్తుతం ఆ సంఖ్య 2052కు చేరిందని చెప్పారు. ప్రతి జిల్లాలో ఓ మెడికల్ కాలేజీ అందుబాటులోకి తెచ్చేందుకు సీఎం కృషి చేస్తున్నారని అన్నారు.

కొత్త కాలేజీల రాకతో రానున్న రోజుల్లో మెడికల్ విద్యతో పాటు వైద్యం మెరుగవుతుందని హరీష్ అభిప్రాయపడ్డారు. ప్రతి వైద్య కళాశాలకు అనుబంధంగా 650 పడకల ఆస్పత్రితో 33 రకాల వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు చెప్పారు.

- Advertisement -