కంటికి ఇంపుగా పచ్చదనం, పరిసరాలకు నిండుతనం. ఇదే నినాదం ఇప్పుడు నాలుగో విడత తెలంగాణకు హరితహారంలో పలువురికి స్ఫూర్తిని నింపుతోంది. పెద్ద ఎత్తున మొక్కలు నాటడం ద్వారా భూతాపాన్ని నివారించటం, భవిష్యత్తు తరాలకు మెరుగైన వాతావరణ పరిస్థితులు అందించాలనే సంకల్పంలో భాగం అయ్యేందుకు స్వచ్చంద సంస్థలు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఈ నెల 27న దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ వర్ధంతిని పురస్కరించుకునే ఇగ్నైటింగ్ మైండ్స్, వాక్ ఫర్ వాటర్ స్వచ్చంద సంస్థలు తెలంగాణకు హరితహారంలో భాగంగా గ్రీన్ ఛాలెంజ్ పేరుతో వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.
ఈ గ్రీన్ ఛాలెంజ్‌ను ఎవరైనా స్వీకరించవచ్చు, తమకు సన్నిహితులు, మిత్రులను నామినేట్ చేయొచ్చు. వారు చేయాల్సిందల్లా తాము స్వయంగా మూడు మొక్కలను నాటడం, వాటి పర్యవేక్షణ బాధ్యత తీసుకోవటం, దానితో పాటు మరో ముగ్గురిని ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయటం. ఈ కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్న ముఖ్యమంత్రి ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ మేడ్చల్‌లో మూడు మొక్కలు నాటి, ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. టీఆర్ఎస్ ఎం.పి కవిత, ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సబర్వాల్, మేడ్చల్ కలెక్టర్ ఎం.వి.రెడ్డిని నామినేట్ చేశారు.
ఈ ముగ్గురూ కూడా గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించి తాము మొక్కలు నాటుతామని ప్రకటించారు. మేడ్చల్ కలెక్టర్ ఎం.వి రెడ్డి వెంటనే మూడు మొక్కలు నాటడంతో పాటు, మల్కాజిగిరి ఎంపి మల్లారెడ్డి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్‌లను నామినేట్ చేశారు. ఇలా నాయకులు, అధికారులు, సామాన్య పౌరులు ఈ గ్రీన్ ఛాలెంట్‌లో పాల్గొంటూ పచ్చదనం పెంపుకు కృషి చేయనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలను తాము నిరంతరం పర్యవేక్షిస్తామని, బాధ్యతగా మొక్కలను పెంచిన వారిని అవార్డులు కూడా ఇస్తామని ఇగ్నైటింగ్ మైండ్స్ సంస్థ ప్రతినిధులు తెలిపారు.