పర్యావరణానికి, జీవావరణానికి, ప్రకృతి రమణీయతకు నెలవైన సువిశాల నల్లమల అడవుల్లో యురేనియం నిక్షేపాలను వెలికి తీయడం కోసం తవ్వకాలు జరపాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ శాసనసభ, శాసనమండలి సంయుక్తంగా కోరుతున్నవి. పెద్దపులులు, చిరుతపులులు, చుక్క జింకలు, దుప్పులు, ఎలుగుబంట్లు, నీల్గాయితో సహా అనేక జాతులకు చెందిన జంతుజాలం ఈ నల్లమల అడవిని ఆధారంగా చేసుకునే మనుగడ సాగిస్తున్నది.
అరుదైన ఔషధ మొక్కలతో పాటు లక్షలాది రకాల వృక్షజాలం ఆ అడవిలో ఉంది. అనాదిగా అడవినే ఆధారం చేసుకుని జీవించే చెంచులు తదితర జాతుల ప్రజలున్నారు. ఇదే అడవిలోని ఎత్తైన కొండలు, గుట్టల ద్వారా పారే జలపాతాలే కృష్ణా నదికి పరివాహక ప్రాంతంగా ఉన్నాయి. మొత్తంగా జీవవైవిధ్యానికి నెలవైన నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం కోసం తవ్వకాలు జరపడం వల్ల పర్యావరణ సమతుల్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. మానవాళితో పాటు సమస్త ప్రాణకోటి మనుగడకు ముప్పుగా పరిణమించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
యురేనియం నుంచి వెలువడే అణుధార్మికత వల్ల పంటలు పండే భూమి, పీల్చే గాలి, తాగే నీరు కాలుష్యం అయి మనిషి జీవితం నరక ప్రాయం అవుతుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో జరిపిన యురేనియం తవ్వకాల అనుభవాలు కూడా చేదుగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రాంతంలోని నల్లమలలో యురేనియం తవ్వకాలు జరపడాన్ని యావన్మంది ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసన మండలి కూడా ప్రజల భయాందోళనతో ఏకీభవిస్తున్నది. నల్లమలలో యురేనియం తవ్వకాలు జరపాలనే ఆలోచన విరమించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నది.