ఏపీ ప్రాజెక్టులపై కృష్ణా బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు..

48
KRMB

ఆంధ్రప్రదేశ్ అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకంపై అభ్యంతరం తెలుపుతూ కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. బోర్డు చైర్మన్‌కు నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ లేఖ రాశారు. అనుమతుల్లేకుండా ఏపీ నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతలు, పోతిరెడ్డిపాడు విస్తరణ పనులపై ఫిర్యాదు చేశారు. గతంలో ఎన్జీటీ స్టే విధించినా పనులు కొనసాగుతున్నాయని.. కృష్ణా యాజమాన్య బోర్డు వాటిని అడ్డుకోలేకపోయిందన్న తెలంగాణా ప్రభుత్వం. డీపీఆర్ కోసం సన్నాహకాల పేరిట ప్రాజెక్టు పనులను నిరాఘాటంగా కొనసాగిస్తున్నారని అసహనం వ్యక్తం చేసింది.

ఎన్జీటీ ఆదేశాల మేరకు కృష్ణాబోర్డు కనీసం నిజనిర్ధారణ కమిటీని అక్కడకు పంపలేకపోయిందన్న రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ క్యాబినెట్ కూడా ఏపీ వైఖరిని తీవ్రంగా నిరసించిందన్నారు స్పెషల్ సీఎస్ రజత్ కుమార్. ఏపీ చర్యలతో తెలంగాణ కృష్ణా బేసిన్‌లో కరవు ఏర్పడుతుందని.. ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలు, హైదరాబాద్ తాగునీటి అవసరాలపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని లేఖలో పేర్కొన్నారు రజత్ కుమార్. ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను తక్షణమే నిలిపివేయాలని లేఖలో కోరారు.