తెలంగాణ చిత్రసీమ విశిష్టతను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉత్తమ నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఇచ్చే నంది అవార్డుల స్థానంలో తెలంగాణ పురస్కారాలను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.మొదట ఏపీతో కలిపి అవార్డులు ఇవ్వాలని భావించినా.. ఆ రాష్ట్రం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం తరఫునే పురస్కారాలు ఇవ్వాలని ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ నిర్ణయించింది. తెలంగాణ ఆవిర్భావం నుంచి 2015 డిసెంబరు వరకు పురస్కారాలను వెంటనే ఇవ్వాలని కమిటీ ప్రభుత్వానికి సూచించింది.
‘తెలంగాణ చలన చిత్ర పురస్కారాలు’ పేరిట అవార్డులు ఇవ్వాలని కమిటీ సిఫార్సు చేసింది. 2014 జూన్ 2వ తేదీ నుంచి, 2015 డిసెంబర్ వరకు తెలంగాణలో నిర్మించిన చిత్రాలకు పురస్కరాలు అందజేయాలని సూచించింది.
అవార్డులు:
జాతీయస్థాయి ప్రముఖునికి పైడి జయరాజ్ అవార్డు
తెలంగాణ సినీ ప్రముఖునికి కాంతారావు అవార్డు
ఉత్తమ కుటుంబ కథా చిత్రానికి ప్రభాకర్ రెడ్డి అవార్డు
ఉత్తమ గీత రచయితకు దాశరథి అవార్డు
ఉత్తమ సంగీత దర్శకుడికి చక్రి అవార్డు
2016 జనవరి నుంచి డిసెంబరు వరకు నిర్మించే చిత్రాలకు వచ్చే ఏడాది పురస్కారాలను అందజేయాలని సూచించింది. అంతేకాదు, పురస్కారాలకు పారితోషికం కూడా పెంచాలని కమిటీ సిఫార్సు చేసింది. ఈ కమిటీలో ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, చలనచిత్ర సంస్థ ఎండీ నవీన్ మిత్తల్, ఎన్ శంకర్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, తమ్మారెడ్డి భరద్వాజ్, కె మురళీమోహన్, పి రామ్మోహన్ రావు, కె సురేష్ తదితరులు ఉన్నారు.