ఒడిశా చీకటిని తొలగించిన తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు

272
Electric Employes
- Advertisement -

ఇటివలే వచ్చిన ఫోణి తుఫానుకు ఒడిశా రాష్ట్రంలోని పలు జిల్లాలు అస్తవ్యస్తంగా మారిన సంగతి తెలిసిందే. తుఫాను కారణంగా కరెంట్ కు ఇబ్బందికలగడంతో కరెంట్ సరాఫరా పునరుద్దరణ విషయంలో సాయం చేయాల్సిందిగా ఒడిశా ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. దీంతోనే వెంటనే స్పందించిన సీఎం కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్. కే. జోషి , ట్రాన్స్ కో సీఎండి డి. ప్రభాకర్ రావుతో మాట్లాడి కరెంటు పునరుద్ధరణ పనుల్లో భాగం పంచుకోవాలని కోరారు. దీంతో తెలంగాణ విద్యుత్ సంస్థలకు చెందిన దాదాపు వెయ్యి మంది ఉద్యోగులను ప్రత్యేక వాహనాల ద్వారా ఈ నెల 7న ఒరిస్సా బయలుదేరి వెళ్లారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు అవసరమైన సామాగ్రిని కూడా తమ వెంట తీసుకెళ్లారు. ఆహార సామాగ్రి, గుడారాలు కూడా వెంట తీసుకెళ్లారు. ఎక్కడ విధులు నిర్వర్తిస్తున్న వారు అక్కడే గుడారాలు వేసుకుని, వండుకుని తింటున్నారు.

కరెంటు లైన్లకు అడ్డంగా పడిన చెట్లను తొలగించడం, కరెంటు స్తంభాలను లేపి నిలబెట్టడం, ఒరిగిపోయిన వాటిని సరిచేయడం వంటి పనులు చేశారు. ఇప్పటి వరకు పూర్తిగా దెబ్బతిన్న ప్రాంతంలో 34 కిలోమీటర్ల మేర పనులు పూర్తి చేశారు. 537 కరెంటు స్తంభాలను ఏర్పాటు చేశారు. దెబ్బతిన్న 74 ట్రాన్స్ ఫార్మర్లను మళ్లీ పనిచేసేలా చేశారు. మొత్తం మీద ఒడిషా రాజధాని భువనేశ్వర్ తో పాటు, పూరి జిల్లాలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ చేశారు. తెలంగాణ ఉద్యోగులు రేయింబవళ్లు కష్టపడి పనిచేసి, విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు చేస్తున్నరని కోర్దా కలెక్టర్ భూపేందర్ సింగ్ పూనియా కృతజ్ఞతలు తెలిపారు. విద్యుత్ సరఫరా పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని, కొద్ది రోజుల్లోనే పరిస్థితి మామూలు స్థితికి చేరుకుంటుందని భావిస్తున్నట్లు తెలిపారు.

ఒడిషా రాష్ట్రంలో తుఫాను తాకిడికి గురైన ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాలు పంచుకుంటున్న విద్యుత్ సిబ్బందికి ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు తెలిపారు. తోటి ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో తెలంగాణ ఉద్యోగులు మానవతా దృక్పథంతో అక్కడికి వెళ్లి సహాయక చర్యలు అందిస్తున్నారని ప్రశంసించారు. తక్కువ సమయంలోనే అక్కడ విద్యుత్ పునరుద్ధరణ పనులు విజయవంతం చేశారని అభినందించారు. తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు చేస్తున్న పనికి ప్రశంసలు కురిపించారు ట్రాన్స్ కో సిఎండి . కష్టాల్లో ఉన్న వారికి సహాయం అందించేందుకు ప్రతికూల వాతావరణంలోనూ తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు శ్రమిస్తున్నారని ట్రాన్స్ కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు ప్రశంసించారు.

- Advertisement -