కరోనా మహమ్మారి భారిన పడకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలూ చేపట్టిందని, ప్రజలు చేయాల్సిందల్లా లాక్ డౌన్ ను అమలు చేయడేమనని విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ప్రజలు రాష్ట్ర ప్రభుత్వ సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. కరోనా వైరస్ వ్యాధి వ్యాప్తి నివారణకు పట్టణ వీధుల్లో సోడియం హైపో క్లోరైడ్ మందు నీళ్లలో కలిపి స్ప్రే చేస్తున్నామని మంత్రి తెలిపారు.
ముందుగా పట్టణ ప్రాంతాల్లోనూ, తర్వాత గ్రామాల్లోనూ దీనిని స్ప్రే చేయనున్నామని అన్నారు. ప్రభుత్వ విజ్ఞప్తికి ప్రజలంతా సహకరించి ఇంటి వద్దనే ఉండాలని కోరారు. ప్రతీ రోజూ ఉదయం వేళల్లో నిబంధనలను పాటిస్తూ నిత్యావసర వస్తువులను, కూరగాయలను తెచ్చుకోవాలని కోరారు. ప్రజలంతా ఎక్కడి వారు అక్కడే ఉండాలనీ, ప్రతి ఒక్కరి ఆకలిని ప్రభుత్వం తీరుస్తుందని అన్నారు. జిల్లాలో ఉన్న ఇటుక బట్టి కార్మికులకు నిత్యం భోజన సౌకర్యాన్ని కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఎవరూ అదైర్య పడకుండా ఉండాలని కోరారు. కరోనా వ్యాధిని అరికట్టడానికి ప్రభుత్వం పూర్తి సన్నద్ధత తో ఉందని అన్నారు.