రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ఈ నెల 20 నుండి 28 వరకు శీతాకాల విడిది నిమిత్తం రాష్ట్రానికి రానున్న సందర్భంగా వివిధ శాఖల అధికారులు పకడ్బంది ఏర్పాట్లు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. ఎస్.కె.జోషి ఆదేశించారు. సోమవారం బి.ఆర్.కె.ఆర్ భవన్‌లో రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ మిశ్రా, జి.ఎ.డి. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హా, వైద్య,ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, హోం శాఖ ముఖ్యకార్యదర్శి రవిగుప్త, పోలీసు కమీషనర్లు అంజనీ కుమార్, మహేష్ భగవత్, జిహెచ్ఎంసి కమీషనర్ లోకేష్ కుమార్, జిల్లా కలెక్టర్లు మాణిక్ రాజ్, యం.వి.రెడ్డి, హరీష్ ప్రోటోకాల్ డైరెక్టర్ అర్విందర్ సింగ్, పోలీస్ అధికారి యం.కె.సింగ్, కంటోన్మెంట్, జిహెచ్ఎంసి, సమాచార శాఖ, టిఎస్ ఎస్ పిడిసిఎల్, ఎయిర్ పోర్టు, మిలిటరి తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా సి.యస్ మాట్లాడుతూ.. రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లకు సంబంధించి వివిధ శాఖల అధికారులు యాక్షన్ ప్లాన్ ను రూపొందించి సమన్వయంతో విధులు నిర్వహించాలన్నారు. ఈ నెల 20న మధ్యాహ్నం ఒంటిగంటకు హకీంపేట విమానాశ్రయంకు చేరుకుంటారని, ఈ సందర్బంగా ఎయిర్ పోర్టులో తగు ఏర్పాట్లు చేయాలన్నారు. పర్యటనకు సంబంధించి తగు బందోబస్తు, ట్రాఫిక్ ఏర్పాట్లు, నిరంతర విద్యుత్ సరఫరా, రోడ్లకు మరమ్మత్తులు, పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, అగ్నిమాపక నియంత్రణ వ్యవస్థ తదితర ఏర్పాట్లు చేయాలన్నారు.
రాష్ట్రపతి నిలయంలో సి.సి.టివి లు, మెడికల్ టీమ్ లు, టెలిఫోన్, ఇంటర్ నెట్ సౌకర్యం, పత్రికలు, అందుబాటులో ఉంచాలన్నారు. రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి విధులలో ఉండే వివిధ శాఖల సిబ్బంది వివరాలను కంట్రోల్ రూంలో ఉండే ఇంచార్జి అధికారుల వివరాలను రెండు రోజులలో సమర్పించాలని సి.యస్ ఆదేశించారు. వివిధ శాఖల అధికారులతో కూడిన కంట్రోల్ రూం అప్రమత్తంగా పని చేయాలని ఆయన తెలిపారు.
ఈ నెల 20 నుండి 22 వరకు రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారని ఆయన తెలిపారు. ఈ నెల 23న తిరువనంతపురం పర్యటనకు బయలుదేరి వెళతారని, తిరిగి ఈ నెల 26 సాయంత్రం హైదరాబాద్ చేరుకుంటారని సి.యస్ తెలిపారు. ఈ నెల 27 న రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం నిర్వహిస్తారన్నారు. ఈ నెల 28 న మధ్యాహ్నం రాష్ట్రపతి డిల్లీకి బయలుదేరి వెళతారని సి.యస్ తెలిపారు.
Telangana Chief Secretary SK Joshi Holds Review Meeting On President Ramnath Kovind Tour In Hyderabad..