రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల నష్ట పోకుండా ఇప్పటి వరకు లోతట్టు ప్రాంత ప్రజల్నీ సహాయ పునారవాసలకు చేర్చినట్టు తెలిపారు సీఎస్ సోమేశ్ కుమార్. రాష్ట్రంలో చేపడుతున్న సహాయ పునరావాస కార్యక్రమాలపై సీఎస్ నేడు రాష్ట్ర విపత్తుల నిర్వహణా శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సచివాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ అధికారులు కూడా పాల్గొన్నారు. గత కొద్దీ రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల వల్ల తలెత్తిన పరిస్థితులు అదుపులోనే ఉన్నాయన్నారు. ఏ విధమైన భారీ నష్టం జరగలేదని పేర్కొన్నారు. గోదావరీ నదీ పరివాహక ప్రాంతాలలో ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించామని, ప్రధానంగా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్న ములుగు, భూపాలపల్లి, భద్రాచలం జిల్లాలపై మరింత అప్రమత్తంగా ఉన్నామని పేర్కొన్నారు.
ఇప్పటివరకు వరదల్లో చిక్కుకున్న వందలాది మందిని కాపాడామని, దీనికి తోడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు 16 మందిని, వైమానిక దళం ద్వారా ఇద్దరినీ రక్షించినట్టు సీఎస్ సోమేశ్‌కుమార్ తెలిపారు. రాష్ట్రంలో 223 ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి 19,071 మందికి షెల్టర్ కల్పించామని తెలిపారు. భద్రాచలం జిల్లాలో 43 శిబిరాలలో 6318 మందికి ఆశ్రయం కల్పించగా, ములుగు జిల్లాలో 33 క్యాంప్ లలో 4049 మందికి, భూపాలపల్లి జిల్లాలో 20 క్యాంప్ లలో 1226 మందికి ఆశ్రయం కల్పించామని వివరించారు.