Congress:హామీలంతా ‘ డొల్లే ‘?

23
- Advertisement -

చెప్పేదొకటి చేసేది మరొకటి అన్నట్లుగా ఉంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరు. ఎన్నికల ముందు ఎన్నో హామీలు ప్రకటించి తీర అధికారంలోకి వచ్చిన తరువాత వాటి అమలు విషయంలో మాత్రం నీళ్ళు నములుతున్నారు హస్తం నేతలు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీ హామీలు అమలు చేసి తీరుతామని చెబుతున్నప్పటికీ ఆ దిశగా ప్రయత్నాలేవీ జరగడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ పెంపు.. వంటి పథకాలను మాత్రమే అమల్లోకి తీసుకొచ్చింది. ఇంకా రూ.2 లక్షల రుణమాఫీ, రూ.500కే గ్యాస్ సిలిండర్, మహిళలకు నెలకు రూ.2500, 200 యూనిట్ల ఉచిత కరెంటు, నిరుద్యోగ భృతి.. ఇలా చాలా హామీలే పెండింగ్ లో ఉన్నాయి. ఇవి చాలదన్నట్లుగా జాబ్ క్యాలెండర్ విషయంలో కూడా నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. .

ఇటీవల ఎల్బీ స్టేడియంలో స్టాఫ్ నర్స్ లకు నియామక పత్రాలను సి‌ఎం రేవంత్ రెడ్డి అందజేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మాజీ మంత్రి హరీష్ రావు సి‌ఎం రేవంత్ రెడ్డి సర్కార్ పై ట్విట్టర్ లో నిప్పులు చెరిగారు. మాజీ ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ హయంలో జరిగిన నర్సింగ్ ఆఫీసర్ల భర్తీ ప్రక్రియను కొత్తగా రిక్రూట్మెంట్ చేసినట్లుగా డబ్బా కొట్టుకోవడం రేవంత్ రెడ్డికే చెల్లిందని మాజీ విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు ఫిబ్రవరి 1న గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఆ ఊసే ఎత్తడం లేదు. జాబ్ క్యాలెండర్ హామీని కూడా అమలు కానీ హామీల జాబితాలోకి చేర్చుతారా ? అని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇక ఈ ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి విదితమే. మరి ఆ దిశగా కాంగ్రెస్ సర్కార్ అడుగులు వేస్తుందా లేదా అనేది చూడాలి. మొత్తానికి అలివిగాని హామీలు ఇస్తున్నప్పటికీ వాటి అమలు ఎంతవరకు జరుగుతుందని ప్రశ్నార్థకమే.

Also Read:బిగ్ బాస్ అమర్ దీప్ హీరోగా సినిమా

- Advertisement -