పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ స్ధానాలు పక్కనపెడితే కనీసం పరువుదక్కించుకోవాలని భావిస్తోంది తెలంగాణ కాంగ్రెస్. టీఆర్ఎస్ అభ్యర్థులకు గట్టిపోటీనిచ్చే అభ్యర్థుల కోసం కసరత్తు ముమ్మరం చేస్తున్నారు హస్తం నేతలు. సుదీర్ఘ కసరత్తు అనంతరం 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీచేసేందుకు ఆసక్తికనబరుస్తున్న వారి జాబితాను తెప్పించుకున్న నేతలు షార్ట్ లిస్ట్ చేసిన జాబితాను అధిష్టానానికి అందజేశారు. కొన్నిస్ధానాల్లో పోటీచేసేందుకు అభ్యర్థులే లేకపోవడం,మరికొన్ని స్ధానాల్లో సీటు ఆశీస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో పోటీ ఎక్కువగా ఉన్న స్థానాల్లో ముగ్గురి పేర్లను అధిష్టానం పరిశీలనకు పంపారు పీసీసీ చీఫ్ ఉత్తమ్.
నిజామాబాద్ నుండి మధుయాష్కి పోటీచేసుందుకు విముఖత వ్యక్తం చేస్తుండటంతో ఈ స్థానంలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిని బరిలోకి దించేందుకు పార్టీ నేతలు సిద్ధమయ్యారు. దీంతో పాటు ఆదిలాబాద్ నుండి సోయం బాబూరావు,పెద్దపల్లి నుండి కవ్వంపల్లి సత్యనారాయణ,మెదక్ నుండి అనిల్ కుమార్,కరీంనగర్ నుండి పొన్నం,నాగర్ కర్నూల్ నుండి సతీశ్ మాదిగ పేరును ఫైనల్ చేసినట్లు సమాచారం.
ఇక అసెంబ్లీ ఎన్నికల్లో రెండుసార్లు తన అదృష్టాన్ని పరీక్షించుకున్న మందకృష్ణ మాదిగను వరంగల్ పార్లమెంట్ స్థానం నుండి బరిలోకి దింపేలా ఢిల్లీ పెద్దలు కసరత్తు చేస్తున్నారు. ఇక భువనగిరి నుండి మాజీ ఎంపీ మధుయాష్కి పేరు దాదాపుగా ఖరారైనట్లు టాక్.
పోటీ ఎక్కువగా ఉన్న నల్గొండ, ఖమ్మం స్థానాలపై డైలమా కొనసాగుతోంది. నల్గొండ నుండి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు పలువురు సీనియర్ నేతలు పోటీపడుతుండటంతో ఈ సీటు ఎవరికి దక్కుతుందోనని ఆసక్తి కాంగ్రెస్ నేతల్లో నెలకొంది.ఖమ్మంలోనూ సేమ్ సిచ్యూవేషన్. మల్కాజ్‌గిరి నుండి కూన శ్రీశైలం గౌడ్,చేవెళ్ల నుండి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి,సికింద్రాబాద్ నుండి మాజీ ఎంపీ అంజన్ కుమార్,మహబూబాబాద్ నుండి బలరాం నాయక్,మహబూబ్‌నగర్ నుండి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి,జహీరాబాద్ నుండి మోహన్‌రావు పేర్లు ఖరారైనట్లు తెలుస్తోంది. మొత్తంగా రెండు,మూడు రోజుల్లో అధిష్టానం నుండి ఎంపీ అభ్యర్థులకు సంబంధించి ఫైనల్ లిస్ట్ రానుండటంతో నల్గొండ,ఖమ్మం స్ధానాలు ఎవరికి దక్కుతాయోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.