ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అంతోఇంతో కాంగ్రెస్ పరువు నిలిపిన జిల్లా ఖమ్మం. కాంగ్రెస్ గెలిచిన 19 స్ధానాల్లో మెజార్టీ స్థానాలు ఈ జిల్లా నుండే గెలిచినవే. అయితే ఇప్పుడు సీన్ రీవర్సైంది. కాంగ్రెస్ ముక్త్ తెలంగాణలో భాగంగా ఆపరేషన్ ఆకర్ష్ ఈ జిల్లా నుండే మొదలైంది. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రాములు నాయక్‌తో మొదలైన వలసలు కాంగ్రెస్ నుండి గెలిచిన కందాడి ఉపేందర్ రెడ్డి,రేగ కాంతారావు,బానోతు హరిప్రియ నాయక్, ,టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అంతా కారెక్కేందుకు సిద్ధమని ప్రకటించారు. దీంతో ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 6కి చేరనుండగా త్వరలో ఈ జిల్లా నుండే మరిన్ని వలసలు ఉండనుండటంతో ఉద్యమాల ఖిల్లాపై గులాబీ జెండా రెపరెపలాడనుంది.
ఇక శాసనమండలిలో అనుసరించిన ‘కాంగ్రెస్ సభాపక్షం విలీనం’ వ్యూహాన్నే శాసనసభలో నూ అమలు చేయాలని టీఆర్‌ఎస్ అధిష్టానం భావిస్తోంది. కాంగ్రెస్ గెలిచిన 19 మంది ఎమ్మెల్యేలలో 13 మంది టీఆర్ఎస్‌లో కాంగ్రెస్ శాసనసభాపక్షం విలీనమైనట్లుగా గుర్తిస్తారు. ఇదే జరిగితే కాంగ్రెస్‌కు శాసనసభలోనూ ప్రధాన ప్రతిపక్ష హోదా గల్లంతవుతుంది. ఇప్పటికే ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరనుండటం,మరికొంతమంది కూడా అదేబాటలో నడవనుండటంతో టీఆర్ఎస్‌ఎల్పీలో కాంగ్రెస్ ఎల్పీ వీలినం త్వరలో లాంఛనమే కానుంది.
ఓ వైపు ఎన్నికలు సమీపిస్తుండటం,మరోవైపు ఎమ్మెల్యేలు వలసబాటపడుతుండటంతో కాంగ్రెస్ నేతలు కకావికలం అవుతున్నారు. పార్టీని బ్రతికించుకోవడం సంగతి పక్కన పెడితే ఏ ఎమ్మెల్యే పార్టీని వీడుతారో తెలియక నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు హస్తం నేతలు. టీడీపీలాగే తెలంగాణలో కాంగ్రెస్ ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.