వివేకానందరెడ్డి మృతితో వైఎసీపీకి షాక్

225
ys viveka
- Advertisement -

వైఎస్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు,మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి శుక్రవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. దీంతో పులివెందులలో విషాదచాయలు నెలకొన్నాయి.

1950 ఆగస్టు 8న జన్మించిన వివేకానందరెడ్డి కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి రెండుసార్లు (1999, 2004) ఎన్నికయ్యారు. పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా రెండుసార్లు (1989, 1994) సేవలందించారు. 2009లో సెప్టెంబర్‌లో ఉమ్మడి ఏపీలో మండలి సభ్యుడిగానూ పనిచేశారు. 2010లో వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయనకు భార్య సౌభాగ్య, కుమార్తె ఉన్నారు.

సౌమ్యుడిగా ఉన్న పేరున్న వివేకా లయిన్స్ క్లబ్‌ తరఫున అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. లింగాల కాల్వకు డిజైన్ రూపకల్పన చేసింది కూడా ఆయనే. వైఎస్ వివేకానందరెడ్డి మరణం వైసీపీకే కాదు, కడప జిల్లాకు కూడా తీరనిలోటని అన్ని రాజకీయ పార్టీలూ పేర్కొన్నాయి. సోదరుడు ముఖ్యమంత్రిగా ఉన్నా సాధారణ వ్యక్తిలా చిన్న చిన్న పనుల కోసం కూడా ఆయనే స్వయంగా ఆఫీసులకు వెళ్లేవారని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు.

వైఎస్ మరణం తర్వాత కాంగ్రెస్‌తో విభేదించి జగన్‌ వేరుకుంపటి పెట్టుకున్నా వివేకానందరెడ్డి మాత్రం కాంగ్రెస్‌లో కొనసాగారు. కిరణ్‌కుమార్ రెడ్డి మంత్రివర్గంలో వ్యవసాయ మంత్రిగా పనిచేశారు. అయితే తర్వాత మారిన పరిణామాలతో వైసీపీలోకి చేరి జగన్‌కు అండగా ఉన్నారు. వైఎస్ వివేకా హఠాన్మరణంతో వైసీపీ నేతలు, శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వచ్చే ఎన్నికల్లో కడప ఎంపీ సీటుకు వైఎస్ వివేకా పేరు పరిశీలనలో ఉండగా అంతలోనే ఆయన కన్నుమూయడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు.

- Advertisement -