పార్టీ బలోపేతంపై దృష్టిసారించిన తెలంగాణ కాంగ్రెస్ హద్దు మీరిన నేతలపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఆ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మాజీ మంత్రి దామోదర్ రెడ్డి ఫిర్యాదుతో కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్ చిన్నారెడ్డి..అద్దంకికి షోకాజ్ నోటీస్ జారీ చేశారు.
ఇటీవల ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టిన దయాకర్…. కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దీంతో ఆయనపై మాజీమంత్రి దామోదర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదును కమిటీ పరిశీలించి షోకాజ్ నోటీస్ జారీచేసింది. దీనిపై వారం రోజుల్లోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది.
అద్దంకితో పాటు జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో మదన్‌మోహన్ సేవా కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ తరపున కాకుండా ఎంవైఎఫ్ మదన్ యూత్ ఫోర్స్ పేరుతో చేస్తున్నట్లు కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడు ఫిర్యాదు చేశారు. దీంతో మదన్‌మోహన్ చేపట్టే కార్యక్రమాలను పార్టీ తరపునే చేపట్టాలని, పార్టీ నాయకులందరినీ కలుపుకొని పోవాలని సూచించాలని కమిటీ నిర్ణయించింది.