తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది. దాదాపు ఏడాదిన్నరకు పైగానే సమయం ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయింది. అధికారం ఎలాగైనా దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్న ఆ పార్టీ నేతలు తమ యాక్టివిటీస్ స్పీడప్ చేసే పనిలో ఉన్నా.. గ్రూప్ రాజకీయాలు కూడా అంతే వేగంగా మారుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డిని వ్యతిరేకించే వర్గాలు చాలా ఉన్నాయి. హిడన్ ఎజెండాతో రేవంత్ రెడ్డి తమపై రాజకీయం చేయాలని చూస్తున్నాడని, జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ను తన సొంత పార్టీలా భావిస్తున్నాడంటూ సీనియర్లు చాలా కాలం నుండి అసంతృప్తితో ఉన్నారు. అయితే, తాజాగా రాహుల్ గాంధీ పర్యటనలోనూ రేవంత్ రెడ్డి సొంత రాజకీయం చూసుకున్నాడని, పైగా తను అనుకున్నది రాహుల్ గాంధీతో నెరవేర్చుకున్నట్లు సీనియర్లు గుసగుసలాడుతున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాలని, అది రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ అవుతుందని… బీజేపీపై పోరులో కీలకం అని సీనియర్లు భావిస్తూ వచ్చారు. పైగా అధికారంలో ఉన్న పార్టీతో పొత్తు ద్వారా… 10 సంవత్సరాలుగా అధికారానికి దూరంగా ఉన్న క్యాడర్ కు బూస్ట్ ఇచ్చినట్లు అవుతుందని సీనియర్స్ ఆలోచించటమే కాదు కాంగ్రెస్ అధినాయకత్వం కాస్త చొరవ చూపితే కేసీఆర్ కూడా అంగీకరిస్తారని… కేసీఆర్ కన్నా కూడా కాంగ్రెస్ కే పొత్తు అనివార్యమని వారు బలంగా కోరుకున్నారు. కానీ, ఈ పొత్తులకు రేవంత్ రెడ్డి రెడీగా లేరు. తాను వ్యక్తిగతంగా కేసీఆర్ ను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. రేవంత్ కాంగ్రెస్ లోకి రాకముందు నుండి కేసీఆర్ తో రాజకీయ వైరం ఉంది. దీంతో ఇప్పుడు కూడా కేసీఆర్ తో పొత్తు వద్దని, ఒంటరిగానే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని రాహుల్ గాంధీని ఒప్పించినట్లు కనపడుతుంది.
అందుకే రాహుల్ గాంధీ కూడా రేవంత్ రెడ్డి మాటలు నమ్మి కేసీఆర్ తో పొత్తు ఉండదని బహిరంగంగా ప్రకటించటమే కాదు, పొత్తు గురించి ఎవరైనా అడిగితే బహిష్కరణే అంటూ ప్రకటించారని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ కు రాష్ట్ర రాజకీయాలతో పాటు జాతీయ రాజకీయాలు కీలకం అని తెలిసి కూడా… తన సొంత ప్రయోజనాల కోసం రేవంత్ రెడ్డి పార్టీని ఫణంగా పెడుతున్నారని, ఇప్పుడు కేసీఆర్ ను బీజేపీ దగ్గరకు తీస్తే ఏం చేస్తారని ఇటు రాజకీయ విశ్లేషకులు సైతం ప్రశ్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి తొందర పడి రాహుల్ గాంధీతో చేయించిన వార్నింగ్… కాంగ్రెస్ పుర్టీనే ముంచేలా ఉన్నాయంటున్నారు.