ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఇవాళ ప్రగతి భవన్‌లో కేబినెట్ సమావేశం జరిగింది. మొదటగా కొవిడ్ పరిస్థితిపై చర్చ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా పరిస్థితులపై వైద్యాధికారులతో కెబినెట్ ఆరా తీసింది. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కరోనా స్థితిగతులు, తీసుకుంటున్న చర్యలపై వైద్యాధికారులు కెబినెట్ కు సమాచారం అందించారు. ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో కరోనా పరిస్థితి, నియంత్రణకు సంబంధించి సమాచారాన్ని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. విద్యాసంస్థలు పునఃప్రారంభమైన అనంతర పరిస్థితులను కెబినెట్ కు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖాధికారులు వివరించారు. స్కూళ్లు, కాలేజీలు తెరిచిన తరువాత కరోనా కేసులలో పెరుగుదల లేదని, కరోనా పూర్తిగా అదుపులో ఉందని వారు కెబినెట్ కు వివరించారు. అన్నిరకాల మందులు, ఆక్సిజన్, టెస్ట్ కిట్స్, వ్యాక్సినేషన్ అందుబాటులో ఉన్నాయని వివరించారు.
2 కోట్ల వ్యాక్సినేషన్ పూర్తయిందని, ఇప్పటివరకు 2 కోట్ల, 56 వేల 159 డోసులు అందించారని వారిలో 1 కోటి 45 లక్షల 19 వేల 909 మొదటి డోసు, 55 లక్షల 36వేల 250 మంది రెండు డోసులు ఇవ్వటం జరిగింది. స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ నేటి నుండి ప్రారంభమవుతుందని, ప్రతి గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లోని పంచాయతి మున్సిపల్ అధికారులు, సర్పంచులు, ఎంపిటీసిలు, జడ్పిటీసిలు, ఎంపిపి, జడ్పీ చైర్ పర్సన్, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు తదితిర ప్రజాప్రతినిధులు క్రీయాశీలకంగా వ్యవహరించాలని, మంత్రులందరూ ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయం సాధించాలని, ప్రతిరోజు 3 లక్షల వరకు టీకాలు వేసే విధంగా పూర్తి సన్నద్దతతో వ్యవహరించాలని అధికారులను, ప్రజాప్రతినిధులను కేబినెట్ నిర్దేశించింది.
కొత్త మెడికల్ కాలేజీలు వచ్చే సంవత్సరం నుండి ప్రారంభించడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఆర్ అండ్ బి, వైద్యారోగ్య శాఖను కెబినెట్ ఆదేశించింది. హైదరాబాద్ లో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణ ఏర్పాటుపై కెబినెట్ సమీక్షించింది. ఆసుపత్రుల నిర్మాణ ఏర్పాట్లపై సత్వరమే చర్యలు చేపట్టాలని, అత్యంత వేగంగా ఆసుపత్రుల నిర్మాణం జరగాలని కెబినెట్ ఆదేశించింది. గతంలో 130 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం మాత్రమే వుండేదని, దాన్ని ఇప్పటికే 280 మెట్రిక్ టన్నులకు పెంచుకున్నామని, దీనిని మరింత పెంచి 550 మెట్రిక్ టన్నులకు చేరుకునేలా చర్యలు చేపట్టాలని వైద్యశాఖాధికారులను కెబినెట్ ఆదేశించింది.
ఒకవేళ చిన్నపిల్లలకు కరోనా వస్తే పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని వైద్యాధికారులు కెబినెట్ కు వివరించారు. 133 కోట్ల ఖర్చుతో బెడ్స్, మందులు, ఇతర సామాగ్రిని, చిన్నపిల్లల వైద్యం కొరకు సంబంధించి 5200 బెడ్లు, ముందస్తు ఎర్పాట్లలో భాగంగా ఇప్పటికే సమకూర్చుకున్నామని వైద్యాధికారులు తెలిపారు.రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఆరోగ్య మౌలిక వసతుల పురోభివృద్ధి కొరకు సమగ్రమైన ప్రణాళికలను సిద్ధం చేసుకుని తదుపరి కెబినెట్ ముందుకు తీసుకురావాలని మంత్రి మండలి వైద్య శాఖాధికారులను ఆదేశించిది.
వ్యవసాయం, పౌర సరఫరాల శాఖ సన్నద్ధతపై చర్చ:
వర్షాపాత వివరాలు, వానాకాలంలో రాష్ట్రంలో మొత్తం సాగయిన భూమి వివరాలు, పంటల దిగుబడి అంచనాలు తదితర వ్యవసాయ అంశాలపై కేబినెట్ చర్చించింది. వానాకాలంలో పంటల కొనుగోలుపై అందుకు మార్కెటింగ్ శాఖ సన్నద్ధతపై కేబినెట్ చర్చించింది. పోడు భూముల సమస్యలపై పూర్తి అవగాహన, పరిష్కారాల అన్వేషణ, సూచనలకై కేబినెట్ సబ్ కమిటీ నియామకం జరిగింది. ఈ సబ్ కమిటిలో మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ చైర్మన్ గా, మంత్రులు శ్రీ జగదీశ్ రెడ్డి, శ్రీ ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీ అజయ్ కుమార్ లు సభ్యులుగా వ్యవహరిస్తారు.
హోం శాఖపై సమీక్ష:
కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు ఇతర పోలీస్ స్టేషన్లలోని సమస్యలు అవసరాలను సమీక్షించేందుకు కేబినెట్ సబ్ కమిటీ నియమిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. హోం శాఖ మంత్రి శ్రీ మహమూద్ అలీ నేతృత్వంలో మంత్రులు శ్రీ హరీష్ రావు, శ్రీ జగదీశ్ రెడ్డి, శ్రీ కొప్పుల ఈశ్వర్, శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీ వి.శ్రీనివాస్ గౌడ్, శ్రీ ఇంద్ర కరణ్ రెడ్డి, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ లు సభ్యులుగా ఉంటారు. కాగా, ఈ నెల 24వ తేదీ నుండి శాసనసభ, మండలి సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది.